అత్యుత్సాహంతో ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

అత్యుత్సాహంతో ఆంక్షలు

Nov 2 2026 1:47 AM | Updated on Nov 2 2026 1:47 AM

● కలెక్టరేట్‌ వద్ద అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు ● ప్రజా ప్రతినిధులతో వాగ్వాదం

తిరుపతి అర్బన్‌ : వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్నవారిపై దాడులు, దౌర్జన్యాలు చేయడంతోపాటు భయబ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ నేతల అరాచకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు నిర్ణయించారు. ఆదివారం ఈ మేరకు ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ తొట్టంబేడు మండలం జెడ్పీటీసీ అభ్యర్థి ఉన్నం వాసుదేవ నాయుడుతోపాటు ఐదుగురు ఎంపీటీసీ అభ్యర్థులు ముందుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందించారు. నంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. అయితే కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. వీఐపీలను మాత్రమే లోనికి అనుమతి ఇస్తామని, ఎంపీటీసీ అభ్యర్థులను లోపలికి పంపమని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో వైఎస్సార్‌సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.

సామాన్యులకు అనుమతి లేదా..?

కలెక్టరేట్‌లోకి ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేను మాత్రమే పంపుతామని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను పంపడం కుదరదని పోలీసులు తేల్చిచెప్పడంపై ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మండిపడ్డారు. తమకు రక్షణ కల్పించమని కలెక్టర్‌ను కలవడానికి వెళుతుంటే పోలీసులు ఆకాంక్షలు పెట్టడం ఎంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నికల్లో అడుగడుగున పోలీసులతో పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు, పేదలను పంపడం వీలుకాదని వీఐపీలను మాత్రమే పంపుతామని చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలు, వైఎస్సార్‌సీపీ వాళ్లకు కలెక్టరేట్‌లోకి వచ్చే యోగ్యత లేదా అంటూ నిలదీశారు. అలాంటప్పుడు కలెక్టరేట్‌ ముందు టీడీపీ కార్యాలయం అంటూ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని మండిపడ్డారు. అనంతరం ఎంపీ గురుమూర్తి ఫోన్‌లో కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. వెంటనే కలెక్టర్‌ జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఎంపీటీసీ అభ్యర్థులను సైతం కలెక్టరేట్‌ లోనికి అనుమతి ఇచ్చారు.

అభ్యర్థులకు రక్షణ కల్పించండి

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిపించాలన్నారు.. కూటమి నేతలు పోలింగ్‌ రోజు దౌర్జన్యాలు, దాడులు చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు కల్పించాలని, ప్రతి ఓటర్‌ నిర్భయంగా తమ ఓటు హక్కును వివియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పకుండా పటిష్టమైన భద్రత ఇస్తామని, ఎన్నికలు సజావుగా జరిపిస్తామని కలెక్టర్‌ వారికి భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement