డక్కిలి : మండలంలోని సంగనపల్లెలో పాలనేత(21) అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించి చికిత్సపొందుతూ మృతి చెందాడు. వివరాలు.. గ్రామానికి చెందిన జడపల్లి వెంకటకృష్ణయ్య కుమారుడు పాలనేత్ర సెప్టెంబర్ 22వ తేదీన అయ్యప్ప స్వామి మాల ధరించాలని తల్లిదండ్రులకు తెలిపాడు. అయితే ఇప్పటికే పెద్దకుమారుడు రమేష్ మాల వేశాడని, ఆర్థిక పరిస్థితి కారణంగా వచ్చే ఏడాది మాల ధరించవవచ్చని పాలనేత్రకు సూచించారు. దీవతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగేశాడు. మెరుగైన వైద్యం కోసం చైన్నెలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డక్కిలి పోలీసులు తెలిపారు.
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
సూళ్లూరుపేట రూరల్ : మండలంలోని దావాడి గుంట చెరువులో ఆదివారం ప్రమాదవశాత్తు పడి శివ(42) అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుక్ను పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
టెంపో ఢీకొని రైతుకు గాయాలు
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని బయనపల్లెకు చెందిన రవిచంద్ర అనే రైతు ఆదివారం పొలం పనులు చూసుకుని ద్విచక్రవాహనంలో ఇంటికి వస్తుండగా టెంపో ఢీకొంది. క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంట్లో చోరీ
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని వీపీఆర్ కండ్రిగ పంచాయతీ కొండయ్యగారిపల్లెకు చెందిన కొండూరు శైలజ తన కుటుంబంతో కలిసి శనివారం తిరుపతిలో ఓ వివాహానికి హాజరయ్యారు. ఆదివారం తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో చోరీ జరిగింది. దుండగుల తాళాలు పగులగొట్టి 400 గ్రాముల బంగారం, 60 వేల నగదు అపహరించారు. బాధితులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమ్మవారి సేవలో గోవా మంత్రి
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గోవా మంత్రి వావిన్ గోడిన్హో కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని, అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రమేష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
తిరుపతి అర్బన్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు మహబూబ్ బాషా ఆదివారం వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, ఓటర్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.అలాగే ఎన్నికల వ్యయానికి సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 19 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 74,239 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,313 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


