తిరుపతి క్రైం : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తిరుపతిలో సోమవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు ఎస్పీ (పరిపాలన) ఏ.శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీసు శాఖలో వినియోగించే ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, నేర పరిశోధనలో ఉపయోగించే వ్యవస్థల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మెటల్ డిటెక్టర్లు, డ్రాగన్ లైట్లు, రాకర్లు, బాంబు డిస్పోజల్ పరికరాల పనితీరును వివరించారు. పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజల రక్షణకు తీసుకునే చర్యలను తెలియజేశారు. చదువుతోపాటు నైతిక విలువలు నేర్చుకోవాలని సూచించారు. పోలీసు శాఖ నేరాల నియంత్రణకే పరిమితం కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నాగభూషణం, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తిరుపతి బాలోత్సవం వాయిదా
తిరుపతి కల్చరల్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నెల 31, నవంబర్ 1వ తేదీ నిర్వహించాల్సిన తిరుపతి బాలోత్సవం ఐదవ పిల్లల పండుగను డిసెంబర్ 19, 20వ తేదీలకు వాయిదా వేసినట్టు తిరుపతి బాలోత్సవం అధ్యక్ష, కార్యదర్శులు నడ్డి నారాయణ, పి.గురునాథం తెలిపారు. బాలోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యా ర్థులు పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.


