తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వర్గ విస్తరణే అజెండాగా ఎత్తులు అడ్డుపడిన వారిపై దాడులు.. దౌర్జన్యాలు జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ, జనసేన ముఖ్యనేతలు
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వర్గానికి ఈ ఎన్నికల్లో తీరని అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే టికెట్టు, టీడీపీ ఇన్‌చార్జి రాకపోగా తన మనుమరాలికి మేయర్ సీటు ఇప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. తిరుపతిలో అతిపెద్ద వర్గం ఉన్న సుగుణమ్మ అనుచరులకు, నమ్ముకున్న వాళ్లకు సీట్ల కేటాయింపులో చుక్కలు చూపించారు. గుడ్డికన్నా మెల్ల మేలు అన్నట్టు తన మనమరాలికి కార్పొరేట్ సీటును మాత్రం ఇప్పించుకోగలిగారు. ఒకప్పుడు తిరుపతిని ఏలిన మబ్బు కుటుంబం టీడీపీనే నమ్ముకుంది. పార్టీ తిరుపతి ఇన్‌చార్జి పదవి, తుడా చైర్మన్, జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎదురుచూసిన వారికి చివరికి నిరాశే మిగిలింది. తమ వర్గానికి కార్పొరేటర్ సీట్లు ఇప్పించుకుందామని ప్రయత్నం చేసినా దిక్కూ మొక్కులేని నాయకుడిగా మిగిలిపోవాల్సి వచ్చింది. తిరుపతి ఇన్‌చార్జి నేనే అంటూ ఏడాదిన్నరగా ప్రచారం చేసుకుంటున్న కోడూరు బాలసుబ్రమణ్యానికి సైతం ఈ ఎన్నికలు నిరాశను మిగిల్చాయి. తన శిష్యుడు నామినేషన్ వేసేందుకు వెళ్లగా టీడీపీ నేతలే దాడి చేశారు. అలాగే డివిజన్‌కు సంబంధించి సీటు తమకంటే తమకే అంటూ సుగుణమ్మ, నరసింహయాదవ్ వర్గం కుస్తీ పడే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన ఆర్సీ మునికృష్ణకు సైతం చివరి నిమిషంలో బీ ఫామ్ లభించింది. టీడీపీలో అనేకమంది పరిస్థితి ఇలాగే ఉంది.
మారిన తలరాతలు
టీడీపీ బలోపేతం కోసం దశాబ్దాలుగా కష్టపడి, పార్టీని నమ్ముకున్న వాళ్లకు తిరుపతి మేయర్ ఎన్నికలు పీడ కలను మిగిల్చాయి. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువగా రెండు మూడు వర్గాలకు చెందిన వారికి అవకాశం కల్పించడాన్ని టీడీపీ నేతలే తీవ్రంగా తప్పుపడుతున్నారు. మేయర్ రేసులో ముందు వరుసలో ఉన్న అన్నా అనితకు నిరాశ మిగిలింది. కుంగుబాటులో ఉన్న తరుణంలో సీట్ల కేటాయింపు జరిగిపోయింది. జీవకోన ప్రాంతం తమదిగా భావించే అన్నా రామచంద్ర కుటుంబానికి ఇక్కడా అన్యాయం జరిగింది. ప్రతి ఎన్నికల్లో ఆ ప్రాంతంలోని నాలుగు డివిజన్లకు సంబంధించి అన్నా కుటుంబం చెప్పిన వాళ్లకి టికెట్లు ఇచ్చేవాళ్లు. ఈ సారి అన్నా కుటుంబాన్ని నమ్ముకున్న పార్టీనే నట్టేటముంచేసిందని అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల చివరి రోజు 65వ డివిజన్‌కు నామినేషన్ వేసేందుకు అన్నా మల్లీశ్వరి వెళ్లగా టీడీపీ గూండాలు ఆమె నామినేషన్ చింపివేయడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తిరుపతి మేయర్ ఎన్నికలతో టీడీపీ సీనియర్లకు చెక్ పడింది. పార్టీ తమ సొంతమనే భావనతో దశాబ్దాలుగా పనిచేసిన వారికి, వారి అనుచరులకు ఒక్క కార్పొరేటర్ సీటు ఇప్పించుకోలేక పోయిన జాబితా చాంతాడంత ఉంది. తిరుపతి టీడీపీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న జేబీ శ్రీనివాస్ తమ పార్టీకే చెందిన ఆశావహులు నామినేషన్లు వేయనివ్వకుండా దాడులు, దౌర్జన్యాలు చేయించారు. నామినేషన్ పత్రాలను చించి పారబోశారు. అద్దెకు తెచ్చుకున్న గూండాలతో దాడులు చేయించడంతో కూటమి నేతలు, కార్యకర్తలు అవమాన భారంతో కుంగిపోతున్నారు.
వర్గ విస్తరణే లక్ష్యంగా అడుగులు
మూడు నెలల క్రితం టీడీపీ తిరుపతి ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన జేబీ శ్రీనివాస్‌ను తిరుపతి మేయర్ సీటు అనూహ్యంగా వరించింది. ఈ క్రమంలో తిరుపతిలో తన వర్గాన్ని విస్తరించుకునేందుకు కార్పొరేషన్ ఎన్నికలను పావుగా వాడుకుంటున్నారనే ప్రచారం ఉంది. తన వెంట నడిచే వారికి, తన అనుచరులకు, భవిష్యత్తులో తనకు అడ్టురారని భావించిన వారికే ఎక్కువ సీట్లు కేటాయించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 20 నుంచి 25 సీట్లను తన వర్గానికి కేటాయించుకున్నారని టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకున్న తమను అణచివేయడం, భవిష్యత్తు లేకుండా చేయాలనుకోవడం సరైంది కాదంటూ మండిపడుతున్నారు.
యాదవులకు మొండి చెయ్యి
తిరుపతి జనాభాలో రెండో అదే పెద్ద సామాజిక వర్గం ఉన్న యాదవులకు టీడీపీ మొండి చేయి చూపింది. గత సార్వత్రిక ఎన్నికలలో తిరుపతి ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించారు. ఎమ్మెల్యేగా బలిజ సమాజకవర్గానికి చెందిన వ్యక్తి గెలుపొందారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన యాదవ సామాజిక వర్గానికి నిరాశ మిగిలింది. తిరుపతి ఇన్‌చార్జి పదవి వస్తుందని యాదవులు భావించారు. అలానే తిరుపతి మేయర్ సీటుపై యాదవులు గంపెడాశలు పెట్టుకున్నారు. అన్నా అనిత, దంపూరి భాస్కర్ యాదవ్, డాక్టర్ గుణశేఖర్ మేయర్ సీటు కోసం చివరి క్షణం వరకు పోరాడారు. అయితే టీడీపీ అధిష్టానం అనూహ్యంగా ఆ పార్టీ తిరుపతి ఇన్‌చార్జి, బలిజనేత జేబీ శ్రీనివాస్‌కు కేటాయించింది. దీంతో యాదవులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జనరల్ మహిళ స్థానంలో యాదవులకు అవకాశం కల్పిస్తూ తిరుపతి తొలి మేయర్‌గా డాక్టర్ శిరీషకి కట్టబెట్టి ఆ సామాజిక వర్గాన్ని గౌరవించింది. తాజా ఎన్నికల్లో మరో మారు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా యాదవులకు అవకాశం కల్పించడం విశేషం.
టీడీపీలో జేబీ శ్రీనివాస్ మంటలు
దశాబ్దాలుగా టీడీపీ జెండా మోసినోళ్లకి చుక్కెదురైంది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో అవమానభారమే మిగిలింది. ఇన్నేళ్లుగా ముఖ్యనేతలమని చెప్పుకునే వాళ్ల మాట సైతం చెల్లుబాటు కాని దుస్థితి దాపురించింది. కూటమి తరఫున మేయర్ అభ్య ర్థిగా జేబీ శ్రీనివాస్ బరిలో దిగిన తర్వాత గూండాగిరీ రాజ్యమేలుతోంది. తన వర్గీయులకే ఆయన ప్రాధాన్యమిస్తూ.. సీనియర్ నాయకులకు సైతం చుక్కలు చూపిస్తుండడంతో కూటమిలోని ఇతర పార్టీలకు సైతం దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రౌడీమూకలను వెంటేసుకుని జేబీ శ్రీనివాస్ హల్‌చల్ చేస్తుండడంతో ప్రశ్నించేందుకు సైతం ధైర్యం చాలని దయనీయ స్థితి కూటమి నేతలకు తలెత్తింది.


