సాక్షి, టాస్క్‌ఫోర్స్ : చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తిరస్కరణపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. చిన్న కారణాలు చూపించి 142 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు తిరుపతి ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట తమ పార్టీ అభ్యర్థులతో కలసి రోడ్డుపై బైఠాయించారు. మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ నామినేషన్లు వేయనీయకుండా కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. హైకోర్టులో పిటిషన్‌న్ దాఖలు చేసిన తర్వాతే పోలీసులు ముందుకు వచ్చి ఆరు మండలాల్లోని 96 స్థానాలకు గాను 94 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారని తెలిపారు. అయితే అదే రోజు రాత్రి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్ని మండలాల రిటర్నింగ్ అధికారులకు ఫోన్లు చేసి బెదిరించారని, డబ్బులు ఆశ చూపి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. సంబంధిత అధికారుల కాల్ డేటాను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాని ఒత్తిడి మేరకు 46 స్థానాల్లో మొత్తంగా 142 మంది అభ్యర్థులను పోటీకి దూరం చేశారన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రెండున్నర ఏళ్లు మాత్రమే..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కొట్టి, భయపెట్టి, ఆర్‌ఓలను ప్రలోభపెట్టి ఏకగ్రీవాలు చేసుకుని పదవులు చేపట్టే వారందరికీ రెండున్నరేళ్లు మాత్రమే పదవి ఉంటుందని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి హెచ్చరించారు. తర్వాత జగనన్న ప్రభుత్వం రాగానే వారందరితో రాజీనామా చేయించి ఇప్పుడు ఎవరైతే నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికలకు వెళ్లలేకపోయారు వారందరినీ ఆ సీట్లలో కూర్చోబెడతామని స్పష్టం చేశారు.
ఇదేనా బాబూ.. మీ నీతి
ప్రతి రోజు మీడియా ముందుకు వచ్చి నీతి, నిజాయితీల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి 142 మంది నామినేషన్లు తిరస్కరణకు గురిచేయడంపై ఏం సమాధానం చెబుతారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదని విమర్శించారు. ఆదివారం తిరుపతిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నామినేషన్ల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు,, అభ్యర్థులపై మారణాయుధాలతో దాడులు చేశారని ఆరోపించారు. పోలీసులు, కిరాయి రౌడీలతో భయబ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. ఈ ఘటనల్లో సుమారు 22 మంది నేతలు తలలు పగిలి ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. అయినా వెనక్కి తగ్గకుండా రక్తగాయాలతోనే నామినేషన్లు దాఖలు చేశారని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థుల పత్రాలను తిరస్కరించడం దారుణమన్నారు. రిటర్నింగ్ అధికారులను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి నామినేషన్లు తిరస్కరించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నామినేషన్ల పరిశీలనలో ఆమోదం పొందిన అభ్యర్థుల కుటుంబ సభ్యులను సైతం టీడీపీ గూండాలు భయపెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపడం చేతకాని చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి, చంద్రగిరి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో అరాచకం సృష్టించేందుకు రౌడీ ఎమ్మెల్యేను తీసుకువచ్చారని ఆరోపించారు.
న్యాయం జరగకుంటే ప్రజల్లోకి..
నామినేషన్ల తిరస్కరణపై బాధిత అభ్యర్థులు ఆర్‌డీఓకు అప్పీలు చేసుకున్నారని చెవిరెడ్డి తెలిపారు. న్యాయం జరగకపోతే ప్రతి అభ్యర్థి ఇంటింటికీ వెళ్లి ఎన్నికలు ఎందుకు జరగలేదో ప్రజలకు వివరిస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పతనానికి చంద్రగిరి నుంచే నాంది పలుకుతామని హెచ్చరించారు.


