పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ విత్ ఆటోమేటిక్ ఎస్‌ఎంఎస్ అలెర్ట్ వర్కింగ్ మోడల్‌ను వడమాలపేట మండలనం, ఎస్వీ పురం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ఎన్.మేఘన గైడ్ టీచర్ ఎం.నరసింహారెడ్డి పర్యవేక్షణలో రూపొందించింది. 2023–2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రోగి శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటును నిరంతరం పర్యవేక్షిస్తుంది. వివిధ సెన్సార్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని మైక్రో కంట్రోలర్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఏదేని అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే ఈ పరికరం స్పందించి సంబంధిత డాక్టర్‌ను ఎస్‌ఎంఎస్ రూపంలో అలెర్ట్ చేస్తుంది. తద్వారా ఆ రోగిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు దోహదపడుతుంది.
పంట పొలాల్లో పనిచేసే రైతులు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పాము కాటు నుంచి తప్పించుకోవడానికి రూపొందించిందే ఈ రక్షణ బూటు. ఈ వర్కింగ్ మోడల్‌ను తడ మండలం, వటంబేడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి ఎన్.ధనుష్ గైడ్ టీచర్ వై.వెంకటరమణయ్య పర్యవేక్షణలో తయారుచేశాడు. 2024–25కు సంబంధించి జాతీయ స్థాయికి ఈ ప్రాజెక్టు ఎంపికయ్యింది. గట్టి లెదర్‌తో ఈ షూను రూపొందించాడు. షూ ముందువైపు ఆన్/ఆఫ్ చేసుకునేలా చిన్న లైటు, చిన్న బర్జర్‌ను అమర్చాడు. రాత్రి వేళల్లో రైతులు పొలాలకు వెళ్లినప్పుడు గట్టుపై ఉన్న పాములు ఈ షూ నుంచి వచ్చే కాంతి, అలాగే బర్జర్ సౌండ్‌తో దూరంగా వెళతాయి. తద్వారా పాము కాటు బారిన పడరు. ఈ షూ గట్టి లెదర్‌తో చేయడంతో దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది. చేతిలో టార్చ్‌లైట్, గట్టిగా శబ్ధం చేయాల్సిన పని నుంచి రైతుకు ఉపశమనం లభిస్తుంది.
స్మార్ట్ అలారం ఫర్ ది క్రేజీ చెఫ్
వంట చేసేటప్పుడు ఆహారం వృథా కాకుండా చేయడమే ‘‘స్మార్ట్ అలారం ఫర్ ది క్రేజీ చెఫ్’’ లక్ష్యం. తిరుపతి భారతీయ విద్యాభవన్ విద్యార్థిని సీహెచ్‌కే శ్రీహిత గైడ్ టీచర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును రూపొందించింది. 2023–2024కు సంబంధించి ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపికయ్యింది. ఆహారం వృథా కాకుండా, మాడిపోకుండా ఉండేందుకు వంట చేసే వ్యక్తికి ఆ వంటకం ఉష్ణోగ్రత స్థితిని తెలియజేసేదే ఈ పరికరం ఉద్ధేశం. ఈ పరికరం వంట చేసే వ్యక్తి నమోదు చేసిన ఉష్ణోగ్రత ఆదేశాల మేరకు పనిచేస్తుంది. గ్యాస్ స్టవ్‌పై వంటకం ఉంచి అవసరమైన ఉష్ణోగ్రతను ఈ పరికరంలో నమోదు చేయాలి. స్టవ్‌ను ఆఫ్ చేయడం మరిచిపోతే వెంటనే ఈ పరికరం నుంచి అలారం వస్తుంది. తద్వారా స్టవ్‌ను ఆఫ్ చేయవచ్చు. ఈ పరికరం వంట చేస్తున్న విషయాన్ని విషయాన్ని మరిచిపోయే స్వల్పకాలిక జ్ఞాపకశక్తి సమస్య ఉన్న వారికి ఈ పరికరం ఎంతో ఉపయోగకరం.
పాము కాటు నుంచి రైతుకు రక్షణ బూటు


