ఆచార్య దేవోభవ | - | Sakshi
Sakshi News home page

ఆచార్య దేవోభవ

Sep 5 2026 7:13 AM | Updated on Sep 5 2026 7:13 AM

● విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్న గురువర్యులు ● అత్యుత్తమ బోధనతో ప్రత్యేక గుర్తింపు ● రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న ఎస్వీయూ అధ్యాపకులు

తిరుపతి సిటీ: ‘ప్రపంచంలో వేల సంఖ్యలో వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం అన్నారు.. మాజా రాష్ట్రపతి అబ్ధుల్‌ కలాం. గురువు అనే స్థానానికి వన్నెతెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురష్కరించుకుని ఏటా సెప్టెంబర్‌ 5వ తేదీన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఎస్వీయూలో తమదైనశైలిలో ఉత్తమ బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన పలువురు అధ్యాపకులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. వీరు శనివారం విజయవాడ కేంద్రంగా జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.

అధ్యాపక వృత్తి దేవుడిచ్చిన వరం

మా వంశవృక్షం అంతా ఉపాధ్యాయులే. మా కుటుంబంలో నానమ్మ, తాతయ్య నుంచి ప్రస్తుతం మా జనరేషన్‌ వరకు సుమారు 20 మందికిపైగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. జేఎల్‌గా అధ్యాపక వృత్తి ప్రారంభమై ఎస్వీయూ ఫిజిక్స్‌ విభాగం హెచ్‌ఓడీగా సుమారు 29 ఏళ్ల పాటు ఈ వృత్తిలో కొనసాగుతున్నా. అధ్యాపక వృత్తిలో కొనసాగడం సంతృప్తినిచ్చింది. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కడం గర్వంగా ఉంది.

–ప్రొఫెసర్‌ బీ.దేవప్రసాద్‌రాజు, హెచ్‌ఓడీ, ఫిజిక్స్‌ విభాగం, ఎస్వీయూ

అధ్యాపక వృత్తి అంటే ప్రాణం

అధ్యాపక వృత్తి అంటే నాకు ప్రాణం. ఈ వృత్తికోసం మంచి ఉన్నత ఉద్యోగాలను సైతం వదులుకున్నా. గ్రూప్‌–2తో పాటు పలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలు వచ్చినా చేరలేదు. ఎనిమిదేళ్ల పాటు ఎడ్యుకేషన్‌ విభాగంలోనూ, 19 ఏళ్ల పాటు జాగ్రఫీ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించా. విద్యాబోధనలో ఉన్న తృప్తి ఎక్కడా దొరకదనిపిస్తుంది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉంది.

–ప్రొఫెసర్‌ చండ్రాయుడు, జాగ్రఫీ విభాగం, ఎస్వీయూ

పవిత్రమైన వృత్తి ఇది

సమాజానికి ఉత్తమ పౌరులను అందించే పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అదే లక్ష్యంతో అధ్యాపకునిగా చేరా. ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో అధ్యాపకునిగా 26 ఏళ్ల పూర్తయింది. ప్రస్తుత ఆధునిక యుగంలో కొత్తపుంతలు తొక్కుతున్న పారిశ్రామిక రంగానికి ఉత్తమ ఇంజినీర్లును అందించేందుకు మరింత కృషి చేస్తా. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం సంతోషంగా ఉంది.

–ప్రొఫెసర్‌ పీ.వెంకటరామయ్య, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం, ఎస్వీయూ

టీచింగ్‌ అంటే ప్రత్యేక అభిమానం

టీచింగ్‌ అంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రత్యేక అభిమానం. అధ్యాపకురాలిగా రాణించాలనే లక్ష్యంతో ఈ వృత్తిలో చేరాను. ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో మెకానికల్‌ బ్రాంచ్‌ అధ్యాపకురాలిగా 23 ఏళ్ల అనుభవం సంతృప్తినిచ్చింది. భావి భారతానికి ఉత్తమ విద్యార్థులను అందించడంలో నా వంతు కృషి చేస్తున్నా. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు దక్కడం సంతోషంగా ఉంది.

–ప్రొఫెసర్‌ హేమ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం, ఎస్వీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement