కాణిపాకం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల నేతల ముఖ్య సమావేశం ఆదివారం తిరుపతిలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌న్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి హాజరయ్యే ఈ సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, మేయర్, రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
గురోత్తములు!
తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు వర్సిటీకి చెందిన నలుగురు అధ్యాపకులు ఎంపికయ్యారు. విద్యాబోధన, పరిశోధన, విద్యార్థులకు మార్గనిర్దేశం తదితర రంగాల్లో అందించిన సేవలను గుర్తిస్తూ వీరిని అవార్డులకు ఎంపిక చేశారు. వర్సిటీ పరిధిలోని అప్లైడ్ మైక్రోబయాలజీ విభాగం నుంచి ప్రొఫెసర్ చండి మారుతీకుమారి, ఇంగ్లిష్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వల్లెపు నిర్మల, హోమ్‌సైన్స్ విభాగం ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్ ఎన్.రజని, సోషల్ వర్క్ విభాగం ప్రొఫెసర్ ఐ.వి.లలితకుమారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికై న అధ్యాపకులకు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఉమ వెన్నెంతో పాటు పలువురు అధ్యాపకులు, సిబ్బంది, అభినందనలు తెలిపారు.
కాణిపాకంలో భక్తుల కిటకిట
కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం శుక్రవారం కృష్ణాష్టమి సెలవుదినం కావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లు, దర్శన ప్రాంగణాలు పూర్తిగా నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.


