తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భం డ్యామ్ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహించారు. అనంతరం గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపట్టారు.


