కంది, జొన్న పంటలే మేలు | - | Sakshi
Sakshi News home page

కంది, జొన్న పంటలే మేలు

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

శ్రీకాళహస్తి రూరల్‌: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అధిక నీరు అవసరమున్న పంటలకు బదులు కంది, జొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, ప్రాంతాయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థుల బృందం సూచించింది. ఈ మేరకు సోమవారం శ్రీకాళహస్తి డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించారు. రైతులతో కలిసి వరి పంట పొలాలను పరిశీలించారు. రాయలసీమ జోన్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో మే, జూన్‌, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదు కాలేదన్నారు. తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి నెలకొందన్నారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న పంటలకు ప్రాధాన్యతనిచ్చి సరైన నీటి తడులు అందించాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేవని భారత వాతావరణ శాఖ పేకర్కొన్న నేపథ్యంలో తక్కువ నీరు అవసరమయ్యే కంది, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. రాబోయే రబీ సీజన్‌లోనూ వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కలీముల్లా, మురళీకృష్ణ, ప్రతిమ ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి హేమలత, సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు పి.రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement