రేషన్ రాక ఇబ్బంది పడుతున్న 90 కుటుంబాలు
వరదయ్యపాళెం: మండలంలోని కువ్వాకొల్లి పంచాయతీ, ఎల్లకట్టవ గ్రామంలో రేషన్ వివాదం ముదిరింది. రేషన్ డీలర్ తీరుపై ఆగ్రహించిన గ్రామస్తులు సోమవారం వరదయ్యపాళెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కువ్వాకొల్లి గ్రామంలోని రేషన్ దుకాణాన్ని నిర్వహిస్తున్న ఉమామహేశ్వరి అనధికారికంగా దుకాణం నడుపుతోందని గ్రామస్తులు ఆరోపించారు. గత కొంత కాలంగా ఎల్లకట్టవ గ్రామస్తులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, 20 కేజీల బియ్యానికి 3 కేజీలు తక్కువగా వేస్తున్నారని, చక్కెర తూకంలోనూ తేడాలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. నెల క్రితం ఎల్లకట్టవ, కువ్వాకొల్లి గ్రామాల మధ్య జరిగిన చిన్న వివాదాన్ని డీలర్ రాజకీయ కుట్రలో భాగంగా పెద్దది చేసి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారని ఆరోపించారు. గ్రామాల మధ్య ఘర్షణలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదం కారణంగా ఎల్లకట్టవ గ్రామంలోని 90 కుటుంబాలు గత జులై నుంచి ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు తీసుకోలేకపోతున్నట్టు వాపోయారు. పేదలకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ వరదయ్యపాళెం తహసీల్దార్ శివరామ సుబ్బయ్యకు వినతిపత్రం సమర్పించామని గ్రామస్తులు తెలిపారు. తహసీల్దార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సమస్య పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.


