లోకేష్‌ అవినీతి వల్లే డీఎస్సీలో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ అవినీతి వల్లే డీఎస్సీలో అక్రమాలు

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

● నేడు తిరుపతిలో డీఎస్సీ అక్రమాలపై సమావేశం ● తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి

● నేడు తిరుపతిలో డీఎస్సీ అక్రమాలపై సమావేశం ● తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి

తిరుపతి మంగళం : మంత్రి నారా లోకేష్‌ అవినీతి వల్లే డీఎస్సీ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని, కారకుడైన మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం ఉదయం 9గంటలకు పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో తిరుపతి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పాల్గొంటారన్నారు. తిరుపతి నగరంలోని పార్టీ శ్రేణులంతా ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతు బజారులో

తక్కువ ధరకే బియ్యం

తిరుపతి అర్బన్‌: రైతు బజారులో తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికి తక్కువ ధరలకే బియ్యాన్ని పంపిణీ చేయడానికి సివిల్‌ సప్లై విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ వెల్లడించారు. సోమవారం తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ సమీపంలోని రైతు బజారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్‌ డాలర్‌ దివాకర్‌రెడ్డి, సివిల్‌ సప్లై జిల్లా అధికారి శేషాచలం రాజు, ఆర్డీవో రామ్మోహన్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారి సురేంద్రబాబు, తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ సురేష్‌బాబుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా 28 చోట్ల బియ్యాన్ని తక్కువ ధరకు అందించనున్నట్టు తెలిపారు. కిలో బియ్యం పై రూ.10 నుంచి రూ.14 వరకు తగ్గుతుందని, స్టీమ్‌ బియ్యం(బీపీటీ) బహిరంగ మార్కెట్‌ ధర కేజీ రూ.62 ఉండగా అదేబియ్యం రైతు బజారులో రూ.52 చొప్పున, అలాగే రా బియ్యం రూ.50 చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

రికగ్నిషన్‌ ఫీజు

31లోపు చెల్లించాలి

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలు పొందిన జనరల్‌, ఒకేషన్‌లతో సహా ప్రతి విద్యార్థి రూ. 210 ఈనెల 31వ తేదీలోపు బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌ఐఓ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఆయా కళాశాలలు ఆన్‌లైన్‌లో తమ లాగిన్‌ ద్వారా బోర్డుకు చెల్లించాల్సి ఉంటుందని, ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలకు సమాచారం అందించామని తెలియజేశారు.

టెట్‌కు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతి జిల్లాలో ఈనెల 5 నుంచి 21వ తేదీ వరకు ఏపీ టెట్‌ (టీచర్స్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌)–2026 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కేవీఎన్‌.కుమార్‌ తెలిపారు. కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,991 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరి కోసం తిరుపతి జిల్లాలో 2, చైన్నెలో మూడు మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో జూపార్కు వద్ద ఉన్న అయాన్‌ డిజిటల్‌ జోన్‌లో 10,422 మంది, పుత్తూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో 1,105 మంది, చైన్నె మనిమంగళంలోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌లో 117 మంది, చైన్నెలోని శ్రీజయరామ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 45 మంది, చైన్నె పీఎస్‌బీ పాలిటెక్నిక్‌ కళాశాలలో 302 మంది, మొత్తం 11,991 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే ప్రత్యేకావసరాల అభ్యర్థులు 49 మంది స్క్రైబ్‌లను వివిధ సెక్షన్లకు అనుగుణంగా కేటాయించినట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement