తిరుమల ఘాట్‌లో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ | - | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్‌లో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

● ఆందోళన చెందుతున్న శ్రీవారి భక్తులు ● టీటీడీ నిఘా వ్యవస్థపై తీవ్ర విమర్శలు

● ఆందోళన చెందుతున్న శ్రీవారి భక్తులు ● టీటీడీ నిఘా వ్యవస్థపై తీవ్ర విమర్శలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తిరుమలలో పరిధిలో మరో ఘోర అపచారం చోటు చేసుకుంది. ఘాట్‌ రోడ్డు ఏడో మైలు వద్ద నిత్యం పూజలు అందుకునే చిన్న శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుమలలో చోటు చేసుకుంటున్న ఘటనలు చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ఏడో మైలు వద్ద చిన్న ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్ర పాలకుడిగా భావించి భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ మధ్యే హనుమాన్‌ జయంతి రోజు టీటీడీ ఉన్నతాధికారులు ఆర్భాటంగా ఆంజనేయుడి ప్రతిమకు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కాలినడకన వెళ్లి వచ్చే భక్తులు.. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ చిన్న ఆంజనేయ స్వామిని వాహనాల్లో ప్రయాణించే వారు ఇక్కడ ఆగి పూజలు చేస్తుంటారు. ఈ విగ్రహాన్ని చూసే పీవీఆర్కే ప్రసాద్‌ పెద్ద ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించారని పెద్దలు చెబుతున్నారు. అలా నిత్య పూజలు అందుకునే చిన్న ఆంజనేయస్వామి ప్రతిమ చోరీకి గురైంది. అర్ధరాత్రి దాటాక ఓ వ్యక్తి విగ్రహాన్ని సంచిలో వేసుకుని ఎత్తుకెళ్లాడు. అత్యంత ప్రతిష్టాత్మక తిరుమల శ్రీవారి చెంతనే ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి భద్రత లేకపోవడంపై భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలి, విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యంపై ద్వజమెత్తారు.

నిఘా వ్యవస్థ ఏమైనట్టు?

టీటీడీ నిఘా వ్యవస్థకు అత్యంత పటిష్టమైనదిగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తిరుమల పవిత్రతను కాపాడడంలో టీటీడీ ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ కీలక పాత్రపోషిస్తోంది. అటువంటి నిఘా వ్యవస్థ కొంత కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అలిపిరి టోల్‌ గేటు నుంచి తిరుమలకు వెళ్లే వాహనాల్లో నిషేధిత వస్తువులు కొండపైకి తీసుకెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆలయ పరిసరాల్లో పలుమార్లు నిషేధిత వస్తువులు పట్టుబడడంమే ఇందుకు నిదర్శనం. శ్రీవారికి రక్షణగా నిలబడిన క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహాన్నే చోరీ తీసుకెళుతున్నా నిఘా వ్యవస్థ పసిగట్టలేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా టీటీడీ వివాదాస్పదం అవుతూనే వుంది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడి వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి నెలల తరబడి దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీవేంకటేశ్వరునికి అతి సమీపంలో.. వేలాది మంది పూజలు అందుకునే పరమ పవిత్రమైన ఆంజనేయస్వామి విగ్రహమే దొంగతనానికి గురవ్వడాన్ని భక్తులు మహాపచారం, ఘోరం, మహాపాపంగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement