శాస్త్రోక్తంగా రాజసూయ యాగం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా రాజసూయ యాగం

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

శ్రీకాళహస్తి: పట్టణంలోని చైన్నె రోడ్డులో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాజసూయ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామికి వివిధ అభిషేకాలు, పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టించి గ్రామంలో ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

డీఫార్మసీ కోర్సుల్లో

ప్రవేశానికి దరఖాస్తులు

– వచ్చే నెల 6 వరకు గడువు

తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల కాలవ్యవధిగల డిఫార్మసీ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ వై.ద్వారకనాథ్‌రెడ్డి తెలిపారు. ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తిగల గల వారు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్టు 6వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9908857585, 9966761446, 9550690007 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 82,105 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,484 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement