విజయీభవ.. | - | Sakshi
Sakshi News home page

విజయీభవ..

Mar 15 2026 4:55 AM | Updated on Mar 15 2026 4:55 AM

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

పరీక్షలకు 31,334 మంది విద్యార్థులు

హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7842641323

ఏడాదంతా ఆటపాటలకు స్వస్తి పలికారు.. టీవీలను అటకెక్కించారు..కాలంతో పోటీ పడ్డారు.. క్షణం వృథా కాకుండా కష్టపడి చదివారు.. పుస్తకాలతో కుస్తీ పట్టారు.. నేర్చుకున్న జ్ఞానాన్ని పేపరుపై జాలువార్చే సమయం ఎట్టకేలకు ఆసన్నమైంది. మదిలో నిక్షిప్తమైన అక్షర గనిని వెలికితీసే ఘడియరానే వచ్చింది. ఈ క్రమంలో కంగారు పడకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉత్తమ మార్కుల సాధనకు అడుగేయాల్సిన శుభ తరుణమిదే.. బంగరు భవితకు బాటలు వేసుకునే బంగారు క్షణమిదే.. నీ కలం నుంచి జాలువారే అక్షరాల కలబోత నీ జీవితాశయం వైపు తీసుకెళ్లే నుదుటిరాత..మేలుకో గమ్యం వైపు సాగిపో ఓ విద్యార్థీ.. విజయీభవ..

తిరుపతి అర్బన్‌: విద్యార్థి జీవితంలో కీలకమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే శుభ ఘడియ రానే వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 16 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. జిల్లాలో మొత్తం 165 పరీక్ష కేంద్రాల్లో 31,334 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులుంటే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 78426 41323కు తెలియజేయాల్సి ఉంటుంది. గత ఏడాది 26,679 మంది పది పరీక్షలు రాయగా ఈ ఏడాది 31,334 మంది పరీక్షకు హాజరుకానున్నారు. జిల్లాలో మండలాలు పెరగడంతో 4,655 మంది విద్యార్థులు పెరిగారు. ఆ మేరకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల సమీప ప్రాంతాల్లో జెరాక్స్‌ సెంటర్లు మూత వేయాల్సి ఉంది. విద్యుత్‌ పరికరాలను తీసుకుపోవడానికి విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లకు లేదు.

పరీక్ష రోజుల్లో ఉచిత ప్రయాణం

టెన్త్‌ విద్యార్థులు పరీక్ష రోజుల్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఉచిత సౌకర్యం కల్పించారు. అయితే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ బస్సులో మాత్రమే అవకాశం ఉంటుంది. తమ నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రం వరకు మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయవచ్చ. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

ఉత్తీర్ణత శాతం ఇలా...

సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత రాష్ట్రంలో

సంఖ్య శాతం జిల్లా స్థానం

2022–23 26,388 75.70 8వ స్థానం

2023–24 26,625 90.71 10వ స్థానం

2024–25లో 26,679 79.83 19వ స్థానం

పరీక్షలకు సర్వం సిద్ధం

జిల్లా సమాచారం..

పది విద్యార్థులు 31,334 మంది

రెగ్యులర్‌ విద్యార్థుల్లో బాలురు 14,027 మంది

రెగ్యులర్‌ విద్యార్థుల్లో బాలికలు 12,631 మంది

రెగ్యులర్‌ విద్యార్థుల్లో మొత్తం 29,165 మంది

సప్లిమెంటరీ విద్యార్థులు 1178 మంది

ఏపీఓఎస్‌ఎస్‌ విద్యార్థులు 991 మంది

పరీక్ష కేంద్రాలు 165

చీఫ్‌ సూపరింటెండెంట్లు 179 మంది

డిపార్ట్‌మెంట్‌ అధికారులు 179 మంది

ఇన్విజిలేటర్లు 1,435 మంది

ప్లయింగ్‌ స్క్వాడ్‌లు 10

సిట్టింగ్‌ స్క్వాడ్‌లు 30

ఉత్తీర్ణత శాతం ఇలా...

తేదీ పరీక్ష

16 ఫస్ట్‌ లాంగ్వేజ్‌

18 సెకండ్‌ లాంగ్వేజ్‌

21న ఇంగ్లిష్‌

23 మ్యాథ్స్‌

25 ఫిజకల్‌ సైన్స్‌

28 బయలాజికల్‌ సైన్స్‌

30 సోషియల్‌ స్టడీస్‌

జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు

జిల్లాలో ఎనిమిది పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో బాలాయపల్లి మండలంలోని జయంపు జెడ్పీ హైస్కూల్‌, చిట్టమూరు మండల కేంద్రంలోని టీఎంఆర్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌, ఓజిలి మండలంలోని చిలమానుచేను జెడ్పీ హైస్కూల్‌, నాగలాపురం మండలంలోని బీరకుప్పం జెడ్పీ హైస్కూల్‌, కోట మండలంలోని చిట్టేడులో ఉన్న ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌ బాలుర సెంటర్‌, పుత్తూరు మండలంలోని గోపాలకృష్ణాపురం ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ సెంటర్‌, పుత్తూరు మండలంలోని గేట్‌పుత్తూరు జెడ్పీ హైస్కూల్‌, వరదయ్యపాళెం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement