భూమి.. అధికార పార్టీ పరం!
రేణిగుంటలో భూమిపై టీడీపీ కన్ను
రెవెన్యూ అధికారుల రంగ ప్రవేశం
వాగు పోరంబోకు అంటూ 22 ఇళ్లు కూల్చివేత
రేపోమాపో టీడీపీ నాయకులకు
అప్పగించే అవకాశం
రేణిగుంట: పట్టణంలోని అధికార పార్టీలోని ఒక వర్గం వివేకానంద కాలనీ పక్కన గత ప్రభుత్వంలో నిర్మించుకున్న 22 ఇళ్లపై కన్నేసింది. ఆ ఇళ్లను ఎలాగైనా తొలగించి తాము సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తి తెస్తున్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో 22 ఇళ్లను వాగు పోరంబోకులో నిర్మించుకున్నాని, గత వారంలో నోటీసులు అంటించారు. ఆదివారం తెల్లవారుజామున జేసీబీలు తీసుకొని వచ్చి అన్ని ఇళ్లను నేలమట్టం చేశారు. రెవెన్యూ వారు చెబుతున్నట్లు 769 సర్వేనెంబర్ లో వివేకానంద కాలనీ ఏర్పాటు దాదాపు 30 సంవత్సరాలైంది. కాలనీకి ఉత్తరాన కాలువ ఉండగా కాలనీకి దక్షిణాన ప్రైవేట్ భూమికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో గత ప్రభుత్వంలో పట్టణానికి చెందిన వారు అప్పటి రెవెన్యూ అధికారుల అనుమతితో రేకుల ఇళ్లను నిర్మించుకున్నారు. గత వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో నిర్మించుకున్నారనే కక్షతో పాటు ఆ భూమిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో పట్టణానికి చెందిన అధికార పార్టీలోని ఒక వర్గం నాయకులు పన్నాగం పన్ని అడుగులు వేస్తున్నారు. వాగు పొరంబోకుని అధికార పార్టీలోని ఒక వర్గం నాయకుల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


