హిందువుల మనోభావాలను దెబ్బతీశారు
సైదాపురం: చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని వైఎస్‌ఆర్ సీపీ వెంకటగిరి నియోజవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతోపాటు ఇప్పుడు పయ్యావుల కేశవులు కూడా తమ తీరును అస్సలు మార్చుకోవడం లేదన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంపై నిరాధారమైన ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎవరూ తప్పు చేయలేదని, జంతువుల కొవ్వు కలపలేదని క్లీన్ చిట్ కూడా ఇచ్చారన్నారు. హిందువుల మనోభావాలను రెచ్చ గొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కూటమి నేతలు బరి తెగించి మాట్లాడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నెయ్యి కల్తీ జరిగిందనే భ్రమలో ప్రజలను ఉంచేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పడరాని పాట్లు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో చిట్టేటి హరికృష్ణ,ఽ బాలయ్య, ధనియాల రాధ, శ్రీనివాసులురెడ్డి, ఆరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


