కాసులు ఇస్తేనే.. అటెండెన్స్ మ్యాపింగ్!
తిరుపతి తుడా: తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. చేయితడిపితే చాలు ఏ పని కావాలన్నా క్షణాల్లో పని అయిపోతుంది. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న సీసీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని శాసిస్తున్నారు. సరెండర్ లీవ్ బిల్లు అనుమతి కావాలంటే ఒక్కొక్క ఉద్యోగి రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిందే. వైద్యులైనా, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులైనా సరే లంచం చెల్లిస్తేనే ఫైలు కదులుతుంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఏఓ, సూపరింటెండెంట్, యూడీసీలకు వేర్వేరు ఽమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఏదో ఒక సాకుతో పెండింగ్‌లో పెట్టి కాళ్లు అరిగేలా తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. దీంతో ఉద్యోగులు ఎందుకు ఆ తలనొప్పిని వారు చెప్పిన డబ్బులు ముట్టజెప్పి పనులు చేసుకుని వెళ్తున్నారు.


