ఉపాధి, వ్యవస్థాపకతే ఉన్నత విద్య లక్ష్యం
తిరుపతి సిటీ: ఉన్నత విద్య పూర్తిగా డిగ్రీతో కేంద్రీకృతం కాకుండా ఉపాధి, వ్యవస్థాపకత లక్ష్యంగా అనుసంధానించాలని యూజీసీ జాయింట్ సెక్రటెరీ డాక్టర్ అవిచల్ రాజ్‌కపూర్ సూచించారు. ఎస్వీయూలోని సెనేట్ హాల్‌లో గురువారం ఎన్‌ఈపీ–2020తో దేశంలో ఉన్నత విద్య.. మారుతున్న దృశ్యం అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఉపన్యసించారు. నూతన జాతీయ విద్యావిధానం–2020 దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. 2023లో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సులో డిజిటల్ పరివర్తన, పరిశ్రమ సహకారం, జీవితాంతం అభ్యసించడం వంటి చర్యలతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న విద్యా వ్యవస్థల అవసరాన్ని ప్రపంచ మేధావులు, నాయకులు గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. సమగ్ర డిజిటల్ వ్యూహాలను విశ్వ విద్యాలయాలను అవలంభించాలని ఆయన కోరారు. వీసీ టాటా నర్సింగరావు మాట్లాడుతూ ఎస్వీయూలో ఎన్‌ఈపీ అమలు స్థితి గురించి, విద్య, డిజిటల్ అభ్యాసం, పాఠ్యాంశాల పునర్నిర్మాణం, పరిశోధన ప్రమోషన్, పరిశ్రమల అనుసంధానం వంటి జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం సంస్కరణలను ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, పలు కళాశాలల నుంచి ప్రిన్సిపాళ్లు, డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.


