కనికరించలేరా?
కాళ్లావేళ్లాపడినా
ఆర్డీఓ కోర్టు తీర్పుకు విలువలేదా!
●
ఆక్రమణకు గురైన భూమి
సాక్షి ప్రతినిధి తిరుపతి: ‘పండు ముసలి 90 ఏళ్లు.. ఈయన ఓ నిరుపేద రైతు.. బస్టాండ్లలో నిద్రిస్తూ న్యాయం చేయాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అయ్యా నా భూమి ఆక్రమణకు గురైంది.. న్యాయం చేయండి.’ అంటూ అధికారుల కాళ్లా వేళ్లా పడుతున్నాడు. అయినా న్యాయం జరగలేదు. వివరాలలోకి వెళ్లితే... తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం, బోడేవాండ్లపల్లి గ్రామం, పి వడ్డిపల్లెకు చెందిన కే సిద్ధయ్యకు 50 ఏళ్ల క్రితం అప్పటి సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది యల్లమంద గ్రామం సర్వే నంబర్ 1489లో 5 ఎకరాల భూమిని కేటాయించారు. అదే మండలం వీఆర్ ఆగ్రహారం గ్రామానికి చెందిన భూస్వామి శిరివేలు రమేష్ 2019లో నిరుపేద రైతు అనుభవిస్తున్న 3.65 సెంట్లు భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. ఈ విషయంపై పలుసార్లు పంచాయతీలు నిర్వహించి బతిమలాడుకున్నా పట్టించుకోకుండా బెదిరింపులకు దిగసాగాడు. ఎర్రావారిపాళెం మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు ఆ భూస్వామి కుమ్మక్కు కావడంతో వారు అతనికి సపోర్టుగా మాట్లాడే వారు. దీంతో ఏమీ చేయలేని దుస్థితిలో బాధితుడు సిద్ధయ్య అప్పటి ఆర్డీఓ కార్యాలయం మదనపల్లెలో ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కోర్టులో కేసు నడుస్తున్నా పట్టించుకోకుండా ఆక్రమించిన పొలంలో మామిడి మొక్కలు నాటి సాగు చేశాడు. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత తిరుపతి ఆర్డీఓ కార్యాలయ కోర్టుకు కేసు బదిలీ కావడంతో వాస్తవాలను ఆరా తీసిన కోర్టు 2022 ఆగస్టులో సిద్ధయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పింది.
ఆర్డీఓ కోర్టు ఆదేశాలూ బేఖాతరు
రైతు సిద్ధయ్యకు చెందిన 3.65సెంట్ల భూమిని తక్షణం తిరిగి అప్పగించాలని ఎర్రావారిపాళెం మండల రెవెన్యూ అధికారులకు ఆర్డీఓ కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ అధికారులు బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలుసార్లు ఆర్డీఓ కార్యాలయంలోనూ, కలెక్టర్ కార్యాలయంలోనూ సిద్ధయ్య ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వృద్ధ రైతు తమని ఏమి చేసుకోలేడనే నమ్మకంతో ఆక్రమణ దారుడు మరో అడుగు ముందుకేసి మిగిలిన 1.38 సెంట్ల భూమిని సైతం తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆర్డీఓ కోర్టు ఆదేశాలిచ్చినా తమ భూమిని ఆక్రమణదారుడు వదలకపోవడంతో తిరుపతి ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ వృద్ధ రైతు ప్రదక్షణలు చేస్తూ కనిపించిన వారిని న్యాయం చేయండని బతిమలాడుతున్నాడు.
అయ్యా.. న్యాయం చేయండి మహా ప్రభూ!
వయస్సు మీద పడింది. నడవలేని స్థితి. నాకు ఉన్న 5ఎకరాల భూమిని ఆక్రమించారు. ఆర్డీఓ కోర్టును ఆశ్రయించాను. కోర్టు నాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ ఆక్రమణ దారుడు శిరివేలు రమేష్ నా భూమిలోకి నన్ను అడుగు పెట్టనీయడం లేదు. 2022లో ఆర్డీఓ కోర్టు ఆదేశించినా కనీసం పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్‌ను అమలు చేయాలని ఏళ్ల తరపడి మండల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఇక మండల రెవెన్యూ కార్యాలయానికి రావద్దంటూ అధికారులు గర్జిస్తున్నారు. ఈ వయస్సులో ఇంత దారుణంగా ఇటు అధికారులు, అటు ఆక్రమణ దారుడు నన్ను వేధించడం తట్టుకోలేక పోతున్నాను. ఇప్పటికై నా అధికారులు నాకు న్యాయం చేయాలి. – కే సిద్ధయ్య, రైతు, ఎర్రావారిపాళెం మండలం
కనికరించలేరా?


