కలిచేడులో ఆస్పత్రుల పునరుద్ధరణ ఎప్పుడో చెప్పండి
సైదాపురం: కలిచేడులో 1950లో నిర్మించిన కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జనరల్ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రిల సేవలను ప్రభుత్వం ఎప్పడు పునరుద్ధరిస్తుందో తెలియజేయాలని పార్లమెంట్ సమావేశాల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి సోమవారం ప్రశ్నించారు. అలాగే సైదాపురం మండలంలోని తలుపూరు, కలిచేడులో ఉన్న మైకామైన్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఎంఎంఎల్‌డబ్ల్యూ) పాఠశాలకు నిర్మించి సుమారుగా 77 ఏళ్లు అయ్యిందని, ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఆ పాఠశాలను పునరుద్ధరించేందుకు లేవుట్, డ్రాయింగ్‌లు సమర్పించినప్పటికీ నేటి వరకు కార్యచరణ ప్రారంభం కాలేదని ఎంపీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఎంపీ గురుమూర్తి ప్రశ్నలకు స్పందించిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 17 ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు ఈఎస్‌ఐసీ ప్రాథమిక అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే డిస్పెన్సరీల నిర్వహణ, సిబ్బంది నియామకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో జాప్యం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. కలిచేడు ఆస్పత్రి పునరుద్ధరణ అంశంపై స్పందిస్తూ ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చే యాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలుంటాయని మంత్రి పేర్కొన్నారు.


