ఓవరాల్ చాంపియన్స్‌గా విశాఖ, కృష్ణా
తిరుపతి సిటీ: రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓవరాల్ చాంపియన్స్‌గా విశాఖ, కృష్ణా జిల్లాల జట్లు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా మూడు రోజుల నుంచి జరిగిన రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఘనంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ పద్మారావు హాజరై విజేతలకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక ధృడత్వానికి దోహదపడతాయన్నారు. గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పాల్గొనే ప్రతి ఒక్కరూ విజేతలేనని తెలిపారు. బాలుర విభాగంలో జరిగిన పోటీల్లో విశాఖపట్నం రీజియన్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్ షిప్‌ను గెలుచుకున్నారు. అలాగే బాలుర విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను విశాఖకు చెందిన విద్యార్థి త్రినాథ్ కై వసం చేసుకున్నారు. బాలికల విభాగంలో ఓవరాల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాంపియన్ షిప్‌ను కృష్ణా జిల్లా విద్యార్థినులు కై వసం చేసుకున్నారు. వ్యక్తిగత విభాగంలో కడపకు చెందిన విద్యార్థిని భావ్య సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణారావు, ప్రిన్సిపాళ్లు ఉషాదేవి, డాక్టర్ ద్వారకనాథ్‌రెడ్డి, ఎస్వీ కుమార్, ఎస్ శ్రీనివాసులు, ఎస్వీయూ పీడీ డాక్టర్ ఎం శివశంకర్‌రెడ్డి, హరిప్రసాద్, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, 100 మంది పీడీలు పాల్గొన్నారు.


