వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
ఏర్పేడు: నాన్ థర్మల్ ప్లాస్మా టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో శుక్రవారం ప్లాస్మా రీసెర్చ్ గ్రూప్, వాటర్ క్వాలిటీ రీసెర్చ్ గ్రూప్‌లు సంయుక్తంగా నిర్వహించిన నాన్–థర్మల్ ప్లాస్మా టెక్నాలజీపై అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనను ఆయన సందర్శించారు. ప్రొఫెసర్ షిహాబుద్దీన్ ఎం.మాలియేకల్, డాక్టర్ రీతేష్ కుమార్ గంగ్వార్ నేతృత్వంలోని బృందం ప్లాస్మా శాస్త్రాన్ని వ్యవసాయం, పర్యావరణ భద్రత, పారిశ్రామిక రంగాల్లోని కీలక సవాళ్లకు ఎలా వినియోగించాలో వివరించారు. ఈ ప్రదర్శనలో ప్రధానంగా వికేంద్రీకృత స్థాయిలో, ప్రత్యక్ష ప్రదేశంలో పోషక విలువలు గల లిక్విడ్ ఫెర్టిలైజర్ల తయారీకి అనువైన స్కేలబుల్ ప్లాస్మా వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వాతావరణంలోని నైట్రోజన్‌న్‌ను ప్లాస్మా సాంకేతికత ద్వారా పంటలు సులభంగా గ్రహించగల నీటిలో కరిగే నైట్రేట్లు, రియాక్టివ్ పదార్థాలుగా మార్చడం ద్వారా స్థిరమైన పోషక వనరును అందించవచ్చని చెప్పారు. ఈ విధానం ద్వారా ఖరీదైన దిగుమతి రసాయన ఎరువులపై వ్యవసాయ రంగం ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఎంతో ఆసక్తికరంగా ఉందన్నారు. తిరుపతి ఐఐటీ బృందాన్ని అభినందించారు, స్థిరమైన వ్యవసాయం, పర్యా వరణ పరిరక్షణకు ఈ సాంకేతికత మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, ప్రకృతి వ్యవసాయ విస్తరణ అధికారి షణ్ముగం, కాలుష్య నియంత్రణ అధికారులు పాల్గొన్నారు.


