అక్రమ ఆస్తుల కేసులో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి
తిరుపతి క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఆఫీస్ సబార్డినేట్‌పై ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న మూడో శ్రేణి ఆఫీస్ సబార్డినేట్ నల్లిపోగు తిరుమలేష్‌పై తిరుపతి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గురువారం తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో మొత్తం 11 స్థిరాస్తులు (ఇళ్ల స్థలాలు, ఫ్లాట్, భవనాలు), 1.472 కిలోల బంగారం, 8.77 కిలోల వెండి, రూ.15.26 లక్షల నగదు, ఒక కారుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు విలువైన గృహోపకరణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రెండు బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉండగా, సోదాలు కొనసాగుతున్నా యని పేర్కొన్నారు. నిందితుడిని నిబంధనల ప్రకారం అరెస్ట్ చేసి, నెల్లూరులోని అవినీతి నిరోధక కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు తెలిపారు.
అక్రమ ఆస్తుల కేసులో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి


