ఎస్పీడీసీఎల్‌ ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ యాప్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్పీడీసీఎల్‌ ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ యాప్‌

Jan 30 2026 6:38 AM | Updated on Jan 30 2026 6:38 AM

ఎస్పీ

ఎస్పీడీసీఎల్‌ ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ యాప్‌

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ ఉద్యోగుల కోసం ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అటెండెనన్స్‌ యాప్‌ను రూపొందించామని ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివశంకర్‌ లోతేటి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడంతోపాటు ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందిచడానికి ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో 229 మంది ఉద్యోగులతోపాటు పొరుగుసేవల సిబ్బందికి కూడా ఫిబ్రవరి 1వతేదీ నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ విధానం అమలులోకి వస్తుందన్నారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడవ, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని విద్యుత్‌ శాఖ కార్యాలయాల్లో కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని సీఎండీ శివశంకర్‌ లోతేటి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

స్పెషల్‌ టీచర్‌, థెరపిస్ట్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి కల్చరల్‌: కేంద్ర ప్రభుత్వం సహకారంతో తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, తిరుత్తణి ప్రాంతాల్లో రాష్ట్రీయ సేవా సమితి(రాస్‌)నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రత్యేక ఉపాధ్యాయులు, థెరపిస్ట్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాస్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పోస్టుల 18–40 ఏళ్లలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ప్రకటన వెలువడిన 10 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ సేవా సమితి(రాస్‌), అన్నమయ్య మార్గ్‌, ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌–517502 చిరునామాకు పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 0877–2242404, 8500382542లను సంప్రదించాలన్నారు.

ప్రాణదాన పథకం కింద 387 మంది ఎంపిక

తిరుపతి తుడా: స్విమ్స్‌లో టీటీడీ ప్రాణదాన పథకం కింద 387 మంది రోగులను ఎంపిక చేసినట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ తెలిపారు. రోగులను ఎంపిక చేసేందుకు తన కార్యాలయంలో గురువారం వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్విమ్స్‌ అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ ఆర్థిక సాయంతో పేద రోగులకు ప్రాణదానం పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్సలు చేసేందుకు రోగులను ఎంపిక చేశామన్నారు. ఇందులో కార్డియాలజీ ఆరుగురు, కార్డియో థొరాసిక్‌ 29, జనరల్‌ సర్జరీ 10, మెడిసిన్‌ 42, నెఫ్రాలజీ 134, న్యూరాలజీ 21, న్యూరో సర్జరీ 69, గైనకాలజీ 8 మంది రోగులను శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశామన్నారు. అలాగే సైకియార్టీలో ఒకరు, రేడియేషన్‌ ఆంకాలజీ 4, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రీలజీ 60, సర్జికల్‌ ఆంకాలజీ ఒకరు, యూరాలజీలో ఇద్దరు చొప్పున ఎంపిక చేశామన్నారు. సమావేశంలో బర్డ్‌ హాస్పిటల్‌ నుంచి డాక్టర్‌ వెంకారెడ్డి, మెటర్నరీ ఆస్పత్రి నుంచి డాక్టర్‌ శ్రీనివాస్‌, టీటీడీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కుసుమ కుమారి, స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, పద్మావతి చిన్న పిల్లల హృదయాల నుంచి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హోరా హోరీగా రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌

తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వేదికగా రెండు రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఇంటర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ హోరా హోరీగా సాగుతోంది. రెండోరోజైన గురువారం జరిగిన పలు పోటీల్లో విజేతలకు ఎస్వీ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నిర్మల్‌ కుమార్‌ ప్రియ, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ద్వారకనాథ్‌రెడ్డి, అధికారులు అభినందనలు తెలిపారు. బ్యాడ్మింటన్‌ సింగిల్‌, డబుల్‌ విభాగాల్లో మహిళలు, పురుషుల పోటీలు గురువారం హోరాహోరీగా సాగాయి.

ఎస్పీడీసీఎల్‌ ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ యాప్‌1
1/1

ఎస్పీడీసీఎల్‌ ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ యాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement