మైనారిటీ నేత ఇల్లు కూల్చివేతకు యత్నం
శ్రీకాళహస్తి: పట్టణంలోని అయ్యలనాడుచెరువు ప్రాంతంలో వైఎస్‌ఆర్ సీపీ మైనారిటీ నాయకుడు అమాన్ గత ప్రభుత్వంలో కట్టుకున్న ఇంటిని కూల్చేందుకు మంగళవారం అధికార యంత్రాంగం మొత్తం కదలివచ్చింది. అయ్యలనాయుడుచెరువు మొత్తం కూడా ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న వారే. అయితే వైఎస్‌ఆర్ సీపీ నేత కావడంతో అమాన్‌కు గండంగా పరిణమించింది. గత నెల 20వ తేదీ కోర్టును ఆశ్రయించగా మూడు వారాల్లో సంబంధిత పత్రాలను పురపాలక అధికారులకు సమర్పించాలని సూచించింది. అయితే తను పత్రాలు ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా అధికారులు తీసుకోలేదని బాధితుడు అమాన్ తెలిపాడు.
కదిలివచ్చిన యంత్రాంగం
పురపాలక కమిషనర్, డీఎస్పీ, ముగ్గురు సీఐలు, సుమారు 15మంది పోలీసులు, సుమారు 15 మంది పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు 15 మంది, రెండు జేసీబీలతో ఉదయం ఇంటి వద్దకు చేరుకున్నారు. అమాన్‌ను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కూల్చివేయాలని ప్రయత్నించారు. అయితే అవమాన్ కుటుంబసభ్యులు పెట్రోల్ బాటిల్ పట్టుకుని, బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఇంటికి వెళ్లే విద్యుత్ కనెక్షన్, వాటర్ పైపులైను, సీసీ కెమెరాను, బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చే ౖపైపులైన్లను పురపాలక సంఘం అఽధికారులు పగులగొట్టారు. చివరకు బుధవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బుధవారం సాయంత్రం వరకు గడువు ఇస్తారా లేక రాత్రికి రాత్రే తొలగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సుమారు 400 ఇళ్లు, పునాదులు ధ్వంసం చేశారు. ఈ చర్యలతో ఆ ప్రాంతమంతా భయభ్రాంతులకు గురయ్యారు.
మైనారిటీ నేత ఇల్లు కూల్చివేతకు యత్నం


