ఇక యుద్ధమే..
ఎమ్మెల్యే నాని అంత అవినీతిపరుడే లేరు
ప్రకృతి వనరులను ధ్వంసం చేసి
అడ్డంగా దోచేస్తున్నారు
ప్రభుత్వ భూములు, మఠం భూములను కాజేస్తున్నారు
ఒకటిన్నర సంవత్సరంలో రూ.300 కోట్లు అవినీతి చేశారు
అవినీతి చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేయగలరా?
మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో గత రెండేళ్లుగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇక యుద్ధం మొదలుపెడతాం.. ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న అవినీతిని ప్రజల ముందు పెడతాం.. రాష్ట్రంలో వున్న 175మంది ఎమ్మెల్యేల్లో పులివర్తి నాని అంత అవినీతి పరుడు మరెవ్వరు లేరని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్ సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రగిరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని అవినీతిపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా నాని ఒకటిన్నర సంవత్సరంలో రూ.300 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, ఎక్కడెక్కడ ఎంత సంపాదించారు, ఏయే భూములు కాజేశారన్న వివరాలు త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ హెడ్ ఆఫీసుల నుంచి కూడా విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.. అనునిత్యం దోచుకో.. దాచుకో.. అన్నట్టుగా ప్రకృతి వనరులను దోచేస్తున్న నాని తాను నీతిమంతుడనని కబుర్లు చెప్పుకుంటూ నిజాయతీగా బతికే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
రూ.300 కోట్ల అవినీతి
గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో రూ.300 కోట్లు చంద్రగిరి ఎమ్మెల్యే అవినీతితో సంపాదించారని ఆరోపించారు. తమ వద్ద కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా చేయించి అందులో వాటాలు తీసుకోలేదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఆయన గెలవగానే మొదటగా తాను అభినందించానని, ప్రజలు అవకాశం ఇచ్చారు బాగా పరిపాలన చేయమని కోరుకున్నట్టు తెలిపారు. ఒక ఏడాదిన్నర లోపు ఇంత అవినీతి చేస్తారని, ప్రజలను ఇంతలా పీడిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ప్రతిరోజు ఎమ్మెల్యే నాని ఇంటికి అవినీతి సొమ్ము రాకపోతే వారికి నిద్ర పట్టదని, ఎంత దోచేసినా ప్రజలకు సాయం చేయడానికి మనస్సు రాదన్నారు.
చంద్రగిరిలో జరిగే అవినీతి, అక్రమాలపై పోరాడుతాం...
కాణిపాకంలో ప్రమాణం చేయగలరా?
అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి పాల్పడ లేదని ఆయన కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. నిజాయతీగా భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసి ఆ సంపాదనలో 90 శాతం ప్రజలకే ఖర్చు పెట్టిన చెవిరెడ్డి కుటుంబంపై నిందలు వేయడం మంచిది కాదని హెచ్చరించారు. రాజకీయాల్లో అత్యధిక శాతం ప్రజల కోసమే బతికిన తన తండ్రి చెవిరెడ్డి చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తు చేసుకుంటుంటారని తెలిపారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిని అడుగుతుంటే సాయం చేయడం చేతకాక చేసిన వారిపై అపనిందలు వేస్తున్నారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఒక అవినీతి తిమింగలంగా మారారని, ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కబ్జా చేసేస్తున్నారని ఆరోపించారు.
లాలూచీ పడడం తెలియదు.. అందుకే జైలు
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోరాటం చేయడం తప్ప అధికార పార్టీ నేతలతో లాలూచీ పడడం తమకు తెలియదన్నారు. ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేయడంతోనే మద్యం అక్రమ కేసులో తన తండ్రి చెవిరెడ్డిని జైలుకు పంపారన్నారు. ఆ విషయం ప్రజలు అందరికీ తెలుసనన్నారు. అవసరానికి కాళ్లు పట్టుకోవడం అవసరం తీరాక నిలువునా ముంచేయడం ఎమ్మెల్యే నానికి తెలిసినంత తమకు తెలియదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఎవరెవరి ద్వారా ఎన్ని పనులు చేసుకున్నారో తనకు తెలుసునని, అలా రాజీ పడడం తమకు తెలియదు అన్నారు. సమావేశంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, మస్తాన్, బుల్లెట్ చంద్రమౌళిరెడ్డి, యారాశి శంకర్ రెడ్డి, కోటేశ్వరరెడ్డి, రమేష్ రెడ్డి ఉన్నారు.


