ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 72 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులకు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. బుధవారం రెండో రోజు జరిగిన పరీక్షలకు 72 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జి.రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9 కేంద్రాల్లో జరిగిన ఫస్టియర్ ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ పరీక్షలకు 409 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 362 మంది హాజరయ్యారని, అలాగే ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 348 మందికి 323 మంది హాజరయ్యారని తెలియజేశారు.
అసభ్యకర ప్రవర్తనపై కేసు
దొరవారిసత్రం: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించి, ఇబ్బంది పెట్టిన యనమల అశోక్‌పై పోలీసుల బుధవారం కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలు... వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన అశోక్ నాలుగు రోజుల కిందట బైక్‌లో వెళ్తూ పొలంలో పని చేసే ఓ వివాహితను వదిలిపెడుతానని బైక్‌లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తరువాత అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ అజయ్‌కుమార్ విచారణ జరిపి కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆగమమే శాస్త్రాలకు మూలం
తిరుపతి సిటీ: శాస్త్రాలకు మూలం ఆగమ శాస్త్రమేనని, వందల వృత్తుల వారు దేవాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారని వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు. ఎస్వీ వేదిక్ వర్సిటీలో ఏడు రోజులపాటు నిర్వహించనున్న శిల్ప శాస్త్ర వర్క్‌షాపు బుధవారం వర్సిటీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన అకడమిక్ డీన్ గోలి సుబ్రమణ్యశర్మతోపాటు పలువురు పండితులతో కలసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాలు, విద్యాలయాలు, మాతృగర్భంలాంటి సంస్కార కేంద్రాలని తెలిపారు. ఆగమంలో చెప్పబడిన శిల్ప సంబంధమైన విషయాలను శిల్పశాస్త్ర సహాయంతో వారం రోజులపాటు జరిగే కార్యాశాల ద్వారా తెలుసుకోవాలన్నారు. ఆగమ అధ్యాపకులు, డీన్ డాక్టర్ రాజేష్‌కుమార్, డాక్టర్ నీలకంఠం, రామకృష్ణ, భరతశేఖరాచార్యులు, కార్తికేయన్ పాల్గొన్నారు.
వెండి నాగపడగల తయారీ కేంద్రంలో ప్రమాదం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని వెండి నాగపడగల తయారీ కేంద్రంలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. వెండి కరిగించేందుకు ఉపయోగించే గ్యాస్ పైపు ఊడిపోవడంతో మాధవ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈఓ బాపిరెడ్డి స్పందించి ఆలయం తరఫున ఆర్థిక సాయం అందించారు. అయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పాలిటెక్నిక్ స్పోర్ట్స్‌మీట్ ప్రారంభం
తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–26 బుధవారం కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్వీయూ రీజియన్ ఆర్జేడీ నిమ్మల కుమార్ ప్రియ, ఏయూ రీజియన్ ఆర్జేడీ రామచంద్రరావు ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్‌మీట్‌ను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. తొలిరోజు బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, లాంగ్, హైజంప్ పోటీలు నిర్వహించారు. కాపు సంఘం చైర్మన్ వరప్రసాద్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శేఖర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కమల బాషా, నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ ద్వారకనాథ్‌రెడ్డి, పీడీ రాజీవ్, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు, 15 మంది కేంద్రకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 72 మంది గైర్హాజరు


