మట్టిమాఫియా ఆగడాలు
ఏర్పేడు: మండలంలో మట్టి మాఫియా ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మండలంలోని చిందేపల్లిలో కొందరు టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడి గ్రామ శివార్ల నుంచి రాత్రింబవళ్లు తేడా లేకుండా మట్టి తరలించేస్తున్నారు. ఎస్టీ కాలనీ సమీపంలో చెరువు పోరంబోకు స్థలంలో మట్టిని జేసీబీల సాయంతో తవ్వి ట్రాక్టర్లతో ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. రాత్రివేళల్లో ట్రాక్టర్లు వరుసపెట్టి పెద్ద శబ్దాలు చేసుకుంటూ మట్టిని తీసుకెళ్తుండడంతో ఎస్టీ కాలనీవాసులకు రాత్రిళ్లు నిద్ర కరువవుతోంది. చిందేపల్లి సమీపంలోని తిరుపతివాసులకు ఇళ్లు కేటాయించిన జగనన్న కాలనీ మధ్యలోనే మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. అయితే అధికారగణం కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. అలాగే మండలంలోని కృష్ణాపురానికి వెళ్లే మార్గంలో అడవి నుంచి వచ్చే వాగులో మట్టిని టిప్పర్ల సాయంతో ఎత్తేసి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా మండలంలో మట్టిమాఫియా ఆగడాలు అదుపులోకి రావడం లేదు. మండలంలోని పాగాలి జగనన్న కాలనీలోని ఓ చెరువులోనూ నిత్యం మట్టి ఎత్తుతూ ఓ టీడీపీ నేత సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి మట్టిమాఫియా ఆగడాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మట్టిమాఫియా ఆగడాలు


