సిద్ధార్థలో సిల్వర్ జూబ్లీ వేడుకలు
నారాయణవనం: సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు నిర్వహించే సిల్వర్ జూబ్లీ సావనీర్‌ను కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. బుధవారం ఉదయం కళాశాల ఆడిటోరియంలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి అశోకరాజు దంపతులు రుత్వికులు గణపతి, సరస్వతి, సుదర్శన హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో ప్రతి రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ ఇన్నోవేషన్లపై ప్రాజెక్ట్, పేపర్ ప్రజెంటేషన్లు, సెమినార్లు, క్రీడల పోటీలు, అకడెమిక్ ఎక్స్‌పర్ట్స్ ప్రసంగాలు, అవార్డులు, నృత్య ప్రదర్శనలు ఉంటాయని అశోకరాజు తెలిపారు. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో 24 గంటల హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ ఇందిరవేణి, డైరెక్టర్ చాందిని, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ స్టార్టర్లు, కాపర్ చొరీ
పెళ్లకూరు: మండలంలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్ కాపర్‌ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు రైతులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. పెళ్లకూరు, టెంకాయతోపు, రావులపాడు, భీమవరం, కానూరు వ్యవసాయ పొలాల్లో విద్యుత్ మోటార్లకు ఏర్పాటు చేసుకున్న 40కి పైగా స్టార్టర్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులో ఉన్న కాపర్‌తోపాటు ఆయిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిపారు. తరచూ స్టార్టర్ల చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.


