నేటి నుంచి భూ సర్వేకు బ్రేక్!
తిరుపతి అర్బన్ : జిల్లాలో భూ సర్వే పనులను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లియాకత్ అలీ, కార్యదర్శి జ్యోతిగన్ వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు కలెక్టరేట్‌లో జిల్లా సర్వే అధికారి అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ప్రమోషన్లు, బేసిక్ పే తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రామ సర్వేయర్లకు రూ.32వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ కనీస అర్హతను ఐఐటీ నుంచి డిప్లొమా సివిల్ లేదా బీటెక్ సివిల్‌కు మార్పు చేయాలని కోరారు. రీ సర్వేలో భాగంగా సాంకేతిక పనులు నిర్వహిస్తున్నందుకు టెక్నికల్ అలవెన్స్ ఇప్పించాలన్నారు. రీసర్వేకు అవసరమైన లాప్‌టాప్‌లు, రోవర్లు, స్టేషనరీని సరిపడా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సంఘం వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.


