దశాబ్దాల డివిజన్
కూటమి ఎంపీలు సహకరించేనా?
వైఎస్సార్‌సీపీ ఎంపీలతో గళం కలిపేనా?
బాలాజీ రైల్వే డివిజన్ కల
సాకారమయ్యేనా?
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష.. ఏళ్ల తరబడి ఐదు జిల్లాలవాసుల కల.. చినుకులా మొదలైన ఉద్యమం.. తారస్థాయి చేరింది. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రతి ఒక్కరి మది నిండా ఉంది. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కూటమి ఎంపీలు సహకరించాలని ప్రజానీకం కోరుతోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి గళమెత్తాలని స్పష్టం చేస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తోంది.
తిరుపతి రైల్వేస్టేషన్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ఆధ్యాత్మిక క్షేత్రంన తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ఈ సారైనా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారా లేదా..? అనే అంశం ఐదు జిల్లాల ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్‌గా చేయాలనే ప్రజల ఆకాంక్ష నేరవేర్చేలా ఏపీ ఎంపీలు గళమెత్తి నినదించాల్సిన అవసరముంది. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో సానుకూల నిర్ణయం ఉంటుందనే ఆశాభావం రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యుల్లో వ్యక్తమవుతోంది.
ఉద్యమం.. ఉధృతం
బాలాజీ రైల్వే డివిజన్‌కు కేంద్రం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఐదు జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. డివిజన్ ఏర్పాటుకు అనుకూల అంశాలు ఉన్నా కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఎన్నికల జరిగే రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తారని, కొత్త డివిజన్లు, రైలు మార్గాలు ప్రకటన వెలువడుతుందని రైల్వే నిపుణులు భావిస్తున్నారు. రైల్వేట్రాక్ మీద రాజకీయ భవిష్యత్తును ఉంచుకునే దిశగా కేంద్రం బడ్జెట్ రూపకల్పన ఉంటుందనేది ప్రాథమిక అంచనా. ఇందులో భాగంగా బాలాజీ రైల్వేడివిజన్‌కు చోటు లభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే డివిజన్ ఏర్పాటుకు రైల్వేబోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే డివిజన్ సాధన సమితి చేపట్టిన ఉద్యమం తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్ కడప. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది.
ఐదు జిల్లాల ప్రజల
ఆకాంక్ష నెరవేరేనా?


