అధిక చార్జీలపై చర్యలు తప్పవు
తిరుపతి మంగళం: మోటారు వాహనాల కొనుగోలుదారుల నుంచి రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానికంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. మంగళంలోని తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం మోటారు వాహన డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మురళీమోహన్ మాట్లాడుతూ వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం వాహన డీలర్లకే అనుసంధానం చేసిన విషయం తెలిసిందేనన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిర్దేశిత రుసుము కంటే వాహన డీలర్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తున్న ఆర్‌టీజీఎస్ ద్వారా వెల్లడి అయిందన్నారు. వాహన డీలర్లు కొనుగోలుదారులతో సరైన ప్రవర్తన నియమావళితో మెలగాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చార్జీల పట్టికను ప్రదర్శించాలని డీలర్లకు ఆదేశించారు. మోటారు వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, స్వర్ణలత, ఏఓలు విజయకుమార్, విజయ ప్రశాంతి, వాహన డీలర్లు పాల్గొన్నారు.


