పేదలకే భూములు దక్కాలని ఆందోళన
పెళ్లకూరు: నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు నిరుపేదలకే దక్కాలంటూ ముమ్మారెడ్డిగుంట గ్రామానికి చెందిన పలువురు దళితులు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలోని సర్వే నంబరు 1లో 61ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడ భూములను పుల్లూరు గ్రామానికి చెందిన కొందరు భూస్వాములు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామంలోని దళితులు సంబంధిత భూముల్లోకి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఆర్‌ఐ సంతోషిణిబాయి, సర్వేయర్ సుప్రజ, లక్ష్మణ్ భూముల వద్దకు చేరుకొని పరిశీలించారు. రెవెన్యూ రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి వరకు భూముల్లోకి ఎవ్వరూ దిగకూడదని హెచ్చరించారు.
ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి
తిరుపతి మంగళం : వాహన డ్రైవర్లతో పాటు ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని రాయలసీమ జోన్ ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ కృష్ణవేణి సూచించారు. మంగళంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించారు. కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రవాణా నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. వాహన డ్రైవర్లకు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, హైదరాబాదు నుంచి విజయవాడకు వస్తున్న బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణించిన విషయాన్ని వాహనదారులకు గుర్తు చేశారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించకుండా ప్రమాద బీమాను చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ ఎస్.వెంకటేశ్వరరావు, మోటారు వాహనాల తనిఖీల అధికారులు సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, అతికానాజ్, ప్రసాద్‌వర్మతో పాటు డాక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.
పేదలకే భూములు దక్కాలని ఆందోళన


