లోపాల రీసర్వే
వరదయ్యపాళెం: రీసర్వేతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సమస్యలు తీరి రికార్డు పక్కాగా అనుభవదారుడి పేరిట చేయాలన్న రీసర్వే లక్ష్యం అధికారుల అలసత్వానికి నీరు గారుతోంది. దీనిపై ఫిర్యాదులు అందుతున్నా పరిష్కారం కాని వైనం. అయితే రీసర్వేకు ఎంపికై న గ్రామాల్లో సగానికి పైగా సమస్యలు అలానే ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి మ్యుటేషన్, కరక్షన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే వీటికి సంబంధించి సర్వర్లను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో రోజువారీ సచివాలయాలు, మీసేవల చుట్టూ అర్జీదారులు తిరుగుతున్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో అటు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, ఇటు మండల తహశీల్దార్ కార్యాలయానికి అర్జీదారులు పోటెత్తుతున్నారు. వరదయ్యపాళెం మండలంలో మొదటి దశ కింద అప్పటి ప్రభుత్వంలో కోవూరుపాడు, నెల్లటూరు, అయ్యవారిపాళెం గ్రామాలు రీసర్వేకు ఎంపికయ్యాయి. అయితే ఈ గ్రామాల్లో ఇప్పటిదాకా గడిచిన మూడేళ్ల నుండి సర్వే ప్రక్రియ పూర్తికాలేదు. అంతేకాక సమస్యలు సైతం పుట్టుకొస్తున్నాయి.
పాసు పుస్తకాల పంపిణీకి హడావిడి
ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి కోవూరుపాడు రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ 169 మంది రైతులకు చెందిన భూఖాతాలు ఉన్నాయి. అందులో 74 మంది రైతుల ఖాతాలకు సంబంధించి అన్ని వివరాలతో సక్రమంగా ఉన్నవిగా గుర్తించారు. వీరికి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఈకేవైసీ సైతం చేపడుతున్నారు. అయితే సర్వే నెంబర్లు కొన్ని నమోదు కావాల్సి ఉందని రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
వెంటాడుతున్న సర్వర్ల సమస్య
ప్రధానంగా రీసర్వేలో సమస్యల పరిష్కారం జరగాలంటే సర్వర్లు ఓపెన్ కావాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. రోజువారీ జిల్లా ఉన్నతాధికారులు హడావిడి చేస్తున్నారే గానీ అందుకు సంబంధించి విడుదల చేయాల్సిన సర్వర్లు మాత్రం పనిచేయకుండా చేస్తున్నారు. దీంతో వచ్చే అర్జీదారులకు సమాధానం చెప్పలేక, సమస్యలు పరిష్కారం కాక సతమతమవుతున్నారు.


