వనరుల విధ్వంసం!
పచ్చటి పొలాలు.. ప్రశాంత వాతావరణం.. సగటు మనిషి స్వేచ్ఛగా జీవించేందుకు అనుకూలమైన ప్రాంతం చంద్రగిరి. అలాంటి ప్రస్తుతం ఇసుకాసురుల దాడులు.. రణగొణధ్వనులతో రాత్రింబవళ్లు తిరుగుతున్న భారీ టిప్పర్లు.. ప్రకృతి వనరులను కరిగించేస్తున్న జేసీబీలు.. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పచ్చమూక అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా నదులు.. వంకలు.. వాగులను తవ్వేస్తున్నారు. కొండలు.. గుట్టలను స్వాహా చేసేస్తున్నారు. మాఫియా ఏర్పడి వనరులను విధ్వంసం చేస్తున్నారు. అక్రమంగా రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. అధికారులు సైతం రాజకీయ ఒత్తిడికి తలొగ్గి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో గ్రావెల్ దందా కొనసాగుతూనే ఉంది. ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో రాత్రింబవళ్లు ఇసుక, మట్టి తవ్వకాలు.. తరలింపు సాగుతూనే ఉంది. ప్రధానంగా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీ దళవాయి చెరువులో సుమారు 40 అడుగుల మేర తవ్వేసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. 15శాతం మేర కమీషన్ల రూపంలో వాటాలు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లె, అనుప్పల్లె, గుండోడుకణం, నెత్తకుప్పం, రాయలచెరువు, సిద్ధేశ్వరగుట్ట ప్రాంతాల నుంచి వందలాది టప్పర్లతో అక్రమంగా గ్రావెల్ తరలించేసినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 18 నెలల కాలంలో సుమారు రూ.200కోట్లకు పైగా విలువైన మట్టిని అక్రమార్కులు కొల్లగొట్టారని స్పష్టం చేస్తున్నారు.
మారిన రూపురేఖలు
ఇసుక స్మగ్లింగ్‌కు చంద్రగిరి మండలం కేంద్రంగా నిలుస్తోంది. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో గత ఏడాదిన్నరగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. స్వర్ణముఖినది పరివాహక ప్రాంతాలను భారీ యంత్రాల సాయంతో తవ్వేస్తున్నారు. పట్టపగలే జేసీబీలు, హిటాచీ వంటి భారీ యంత్రాలతో ఇసుకను తోడేసి, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించేస్తున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టర్ నుంచి నెలకు రూ.3వేల వరకు ఓ శాఖకు చెందిన అధికారికి ముడుపులు ముడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం ఇసుకలోనే పట్టణంలోని ఓ మైనారిటీ నేత, మరికొందరు టీడీపీ యువ నేతలు రూ.కోట్లు కూడబెట్టినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా శానంబట్ల, రెడ్డివారిపల్లె, నాగయ్యగారిపల్లె, బుచ్చినాయుడుపల్లె, చంద్రగిరి, పనపాకం, శివగిరి, నరసింగాపురం ప్రాంతాల రూపురేఖలు ఇసుకాసురుల తాకిడికి పూర్తిగా మారిపోవడం గమనార్హం.


