ఆలకించండి.. ఆదుకోండి
తిరుపతి అర్బన్ : సమస్యలపై ఎస్సీ, ఎస్టీలకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి వివిధ సమస్యలతో అర్జీదారులు తరలివచ్చారు. కేవీబీపురం మండలంలో ముంపునకు గురైన ఓళ్లూరు యానాది కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. పంట భూములు గుంతలమయంగా మారి నాశనం అయ్యాయని న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. అలాగే పలువురు ఎస్సీలు తమకు అర్హత ఉన్నా పింఛన్ రావడంలేదని.. ఇప్పించాలంటూ వేడుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు 336 అర్జీలు వస్తే అందులో 258 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే రావడం గమనార్హం. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీలకు చెందిన పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలను ప్రత్యేకంగా పరిష్కారం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌తో పాటు ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా ఎస్సీ,ఎస్టీ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మెడికల్ బృందం ఏర్పాటు లేదు, బేబీ ఫీడింగ్ రూమ్‌ను లాక్ చేశారు. కుర్చీలు చాలీచాలకుండా ఏర్పాటు చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వలముని, పర్వతయ్య, పెంచలయ్య, సరస్వతమ్మ, తాజుద్దీన్, వెంకటరమణ, ధనశేఖర్ పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలు 94
కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యాక్రమం 40 నిమిషాలు ఆలస్యంగా మొదలుపెట్టారు. అయినప్పటికీ వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు 94 అర్జీలను అధికారులకు అందజేశారు. ప్రధానంగా రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగులు 66 సమస్యలపై, జీఎస్‌డబ్ల్యూఎస్ వారు ఏడు, ఎడ్యుకేషన్ వారు 3, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వారు 3, పంచాయతీరాజ్ వారు 3, ఆర్టీసీకి ఉద్యోగులు 3, సోషల్ వెల్ఫేర్ వారు 3, విద్యుత్ విభాగం వారు 2, ట్రెజరీ విభాగం వారు 2, మెడికల్ విభాగం నుంచి 1, సీపీవో విభాగం నుంచి ఒక సమస్యపై కలెక్టర్‌కు అర్జీలను అందజేశారు.
పింఛన్ వస్తేనే మాకు బతుకు
మాది శ్రీకాళహస్తి మండలంలోని ఎర్రగుడిపాడు ఎస్సీ కాలనీ. మా ఎస్సీ కాలనీలోనే 10 మందికి పైగా వృద్ధాప్య పింఛన్‌కు అర్హులైన వారు ఉన్నారు. ప్రభుత్వం నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి రాలేదంటూ వాయిదా వేస్తున్నారు. పింఛన్ వస్తేనే మాకు బతుకు, మాపై దయచూపండి.
–ఎర్రగుడిపాడు ఎస్సీ కాలనీ వాసులు,శ్రీకాళహస్తి మండలం
ఆలకించండి.. ఆదుకోండి


