వైఎస్సార్ సీపీ విద్యార్థి నేతలకు నోటీసులు
తిరుపతి సిటీ: వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓబుల్ రెడ్డి, విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌కు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. విద్యార్థి సంఘాల నేతలపై ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా చేసినందుకు కేసులు పెట్టడం దుర్మార్గమని, ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని వారు అన్నారు.
ఎస్వీయూలో రిమోట్ పైలట్ శిక్షణ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో చిన్న, మధ్యస్థ తరగతి రోటర్ క్రాఫ్ట్ కింద రిమోట్ పైలట్ శిక్షణను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ఆమోదం లభించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన 18–65 ఏళ్ల వయస్సుగల ఔత్సాహికులకు డ్రోన్ పైలెట్ శిక్షణకు అర్హులుగా నిర్ణయించారు. 5 నుంచి 7 రోజుల పాటు శిక్షణ పొందిన వారికి 10 ఏళ్ల పాటు చెల్లుబాటు అయ్యేలా సర్టిఫికెట్లను అందజేయనున్నారు. శిక్షణ విజయవంతగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు భారతదేశం అంతటా వాణిజ్య, పారిశ్రామిక, పరిశోధన, ప్రజా సేవా అనువర్తనాల కోసం చట్టబద్ధంగా డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి అర్హులుగా పరిగణిస్తారు. ఈ విషయంపై ఎస్వీయూ వీసీ టాటా నరసింగరావు క్యాంపస్‌లోని డ్రోన్ శిక్షణా కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ త్వరలో శిక్షణకు సంబంధించి కోర్సు ఫీజు, సిలబస్, శిక్షణ సమయాలను వెల్లడిస్తామని తెలిపారు. పీబీసీ ఏరో హబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్రణవ్ కుమార్ చిట్టే , రితేష్ కుమార్ సింగ్, రూసా కోఆర్డినేటర్లు ఆచార్య సుచరిత ఆచార్య బాలాజీ, సీఈఓ వంశీ రాయల్ హాజరయ్యారు.
శ్రీసిటీలో బాధ్యతాయుత వ్యాపార విధానాలపై వర్క్‌షాప్
శ్రీసిటీ (వరదయ్యపాళెం): తయారీ రంగ సంస్థలను అజెండా–2030కు సంసిద్ధం చేసే క్రమంలో భాగంగా ’బాధ్యతాయుత వ్యాపార విధానాలు’ అంశంపై శుక్రవారం శ్రీసిటీలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీసిటీ, దక్షిణ భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (ఎస్‌ఐసీసీఐ) సంయుక్తంగా స్థానిక స్టేషన్–ఎస్ ఆడిటోరియంలో నిర్వహించింది. ఎస్‌ఐసీసీఐ సీఎస్‌ఆర్ కమిటీ చైర్మన్ రత్నవేల్ రాజన్ మాట్లాడుతూ మానవ హక్కులు, స్థిరత్వాన్ని వ్యాపార కార్యకలాపాల్లో భాగం చేయడంతో పరిశ్రమలను శక్తివంతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు. ది రెమెడీ ప్రాజెక్ట్ సీఈఓ ఆర్చనా కోటేచా, యునైటెడ్ నేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ)కు చెందిన బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్ స్పెషలిస్ట్ నుస్రత్ ఖాన్ మాట్లాడుతూ గ్లోబల్, జపాన్, భారతీయ నియంత్రణా విధివిధానాలపై అవగాహన, వివిధ విభాగాల్లో తయారీ రంగ సంస్థలు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. భారత తయారీ రంగంలో బాధ్యతాయుత వ్యాపార విలువలను పెంపొందించే ప్రక్రియలో భాగమైన ఈ వర్క్‌షాప్ చొరవను ప్రశంసించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వర్క్‌షాప్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీసిటీ ఏజీఎం (హెచ్‌ఆర్) వి.శివకుమార్ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించగా, ప్రశ్నోత్తరాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమం ముగిసింది.
వైఎస్సార్ సీపీ విద్యార్థి నేతలకు నోటీసులు
వైఎస్సార్ సీపీ విద్యార్థి నేతలకు నోటీసులు
వైఎస్సార్ సీపీ విద్యార్థి నేతలకు నోటీసులు


