ఫౌండేషన్ విద్య.. మిథ్య!
ఏర్పేడు: ‘‘రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకొచ్చిన ఫౌండేషన్ స్కూల్ విధానంతో రాష్ట్రంలో సర్కారు విద్యావ్యవస్థ అంపశయ్యకు చేరువవుతున్నదనేందుకు ఈ పాఠశాలలో అమలవుతున్న విద్యనే నిలువెత్తు నిదర్శనం. అది ఏర్పేడు మండలం గుడిమల్లం ప్రాథమిక పాఠశాల.. ఇక్కడ ఉపాధ్యాయురాలు జయంతి ఒక్కరే తరగతి గదిలో కూర్చుని పాఠశాల గోడలకు పాఠాలు చెప్పాల్సిన దుస్థితి.
ఈ పాఠశాలలో 2వ తరగతిలో ఎం.శివ అనే ఒక్క విద్యార్థే చదువుతున్నాడు. గతంలో ఈ పాఠశాలలో 14 మంది విద్యార్థులు చదువుతుండగా, ఇక్కడ ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సమీపంలోని రావిళ్లవారికండ్రిగ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో కలిపేశారు. దీంతో ఇక్కడ ఫౌండేషన్ స్కూల్ పేరుతో 1,2 తరగతులను మాత్రమే నిర్వహిస్తున్నా రు. ఈ రెండు తరగతులకు ఒక్క విద్యార్థే ఉన్నాడు. ఆ చిన్నారికి పాఠ్యాంశాలను బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయిని నియమించారు. ఇది కేవలం ఒక్క గుడిమల్లం ఫౌండేషన్ స్కూల్‌కే పరిమితం కాదు. జిల్లాలోని దాదాపు అన్నీ ఫౌండేషన్ స్కూళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. గత ప్రభుత్వ పాలనలో గుడిమల్లం పాఠశాలను నాడు–నేడు నిధులు రూ.12 లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ వసతులన్నీ అడవికాచిన వెన్నెలను ప్రతిబింబిస్తోంది.


