అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్టు
రూ.9 లక్షలు విలువైన సొత్తు రికవరీ
రేణిగుంట: రైళ్లల్లో ప్రయాణికుల సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయని వచ్చిన వరుస ఫిర్యాదుల మేరకు రెండు ప్రత్యేక బృందాలతో విచారించిన రేణిగుంట రైల్వే పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలీపురుదూర్ జిల్లాకు చెందిన హరిబర్మన్ (31) నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రేణిగుంట రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే జీఆర్పీ సీఐ యతేంద్ర ఈ వివరాలను వెల్లడించారు. రైళ్లల్లో మొబైల్ ఫోన్లు చోరీ చేసిన వెంటనే సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి వారికి తెలియకుండానే భారీ ఎత్తున నగదు చోరీ చేసి, ఆ డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేసేవాడని తెలిపారు. రేణిగుంట పరిధిలో ఇప్పటికీ సుమారు ఐదు సంఘటనలు జరిగాయని, వాటి ద్వారా సుమారు రూ.18 లక్షల వరకు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడని అన్నారు.ఈ నేరాలపై రేణిగుంట జీఆర్పీ సీఐ యతేంద్ర, కడప జీఆర్పీ సీఐ సుధాకర్ రెడ్డి సంయుక్తంగా రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. దర్యాప్తు బృందాలు ఫిర్యాదుదారుల మొబైల్ ఫోన్ డేటా, సీసీ కెమెరాల ఆధారంతోపాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు నుంచి రూ.లక్షల విలువచేసే బంగారం, మొబైల్ ఫోన్లు, ట్యాబ్, నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఆర్పీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లు, చైన్నె రైల్వేక్రైమ్ బ్రాంచ్ సీఐ నవీన్ కుమార్, ఎస్‌ఐలు మధుసూదన్, రమేష్, జగదీష్ పాల్గొన్నారు.


