కబ్జాకోరులకు సహకరిస్తే సహించం
పుల్లంపేట : భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కబ్జాకోరులకు అధికారులు అండగా నిలిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా తిప్పాయపల్లె, అన్నాసముద్రంలో ప్రభుత్వ, గ్రామంలో ప్రస్తుతం లేనివారి డీకేటీ భూములే లక్ష్యంగా కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారన్నారు. సుమారు రూ.50కోట్ల విలువైన 50 ఎకరాలు ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తిప్పాయపల్లెలోని సర్వే నంబర్లు 335, 336, 337 ,338లో ఉన్న డీకేటీ భూములను అన్నాసముద్రానికి చెందిన కూటమి నేత కబ్జా చేశారని, బాధితులు ఆర్‌డీఓ, కలెక్టర్, నందలూరు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వెల్లడించారు. చివరకు బాధితులు సుబ్బరత్నమ్మ, చెంగయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం అక్రమార్కులకే అండగా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేసేంతగా బరితెగించారని తెలిపారు. ఈ క్రమంలోనే ఒకే కుటుంబానికి చెందిన అయ్యల రాజశేఖర్‌రెడ్డి, శంకరమ్మ, రిషిత, హర్షిత, వెంకటనారాయణరెడ్డికి 20 ఎకరాలు అప్పగించిన ఘనత కూడా రెవెన్యూ అధికారులకే దక్కిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పుల్లంపేట మండలంలోని దాదాపు వెయ్యి ఎకరాల వరకు కబ్జాకు గురైందని ఆరోపించారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి ఆక్రమణలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఆకేపాటి.శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత సుదర్శన్‌రెడ్డి, పార్టీ చేనేత విభాగం కన్వీనర్ బోగా.పార్ధసారథి పాల్గొన్నారు.


