బావిలో పడి వ్యక్తి మృతి
రామచంద్రాపురం: బావిలో పడిన మోటారును తీసే క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని లింగమనాయుడు కండ్రిగ బాబు నాయుడు వ్యవసాయ బావి వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. వెంకటరామాపురం పంచాయతీ శవాయి కాల్వ హరిజనవాడ గ్రామానికి చెందిన రాజేష్ (40) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో లింగమనాయుడు కండ్రిగలోని బాబు నాయుడు వ్యవసాయ బావిలో పడిపోయిన మోటారును బయటకు తీసేందుకు రాజేష్‌ను తీసుకెళ్లారు. బావిలోకి దిగిన రాజేష్ ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించాడు.
స్థానికుల అనుమానాలు
రాజేష్ మృతిపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేష్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసిన చంద్రయ్య, వేణుగోపాల్ నాయుడు అతడిని బావి వద్దకు తీసుకెళ్లారని సమాచారం. మోటార్ పైపును లాగే క్రమంలో వారు పైపును వదిలేయడంతో రాజేష్ బావిలో పడిపోయాడని, అతను పడిన వెంటనే కాపాడే ప్రయత్నం చేయకపోవడం వలన ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఓ సామాజిక వర్గం పోలీసుల అండతో ప్రమాదాన్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారన్నారు. మృతుడికి భార్య సుమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


