వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే సైనికులు
కమిటీ నియామకాల్లోని అందరికీ
ఐడీ కార్డులు
జగనన్న అధికారంలోకి రాగానే
కార్యకర్తలకు అగ్రస్థానం
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి వెల్లడి
తిరుపతి మంగళం : దేశ భద్రతకు సైనికులు ఎలానో.. వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలు అలానే అని ఎమ్మెల్సీ, కమిటీల నియామక టాస్క్‌ఫోర్స్ సభ్యు లు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని నియోజకవర్గ సమన్వయకర్తలతో పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీపై అభిమానం, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ పార్టీ అనుబంధ విభాగాల కమిటీల్లో నియమించాలన్నారు. కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఐడీ కార్డులు ఇచ్చి వారికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తారన్నారు. పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో సమన్వయకర్తలంతా త్వరగతిని కమిటీలను నియమించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుద్దామని పిలుపునిచ్చారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనన్నారు. వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అగ్రస్థానం కార్యకర్తలకేనన్నారు. నియోజకవర్గాల్లో కమిటీలను పూర్తి చేయడంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ధర్నాలు, ఉద్యమాలు, నిరసనలు ఇతరత్రా ఏ కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలేనని, వారిని మరిచిపోయే ప్రసక్తే లేదని చెప్పారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకాలు పెచ్చుమీరిపోయాయన్నారు. ప్రతి పేదవాడికి మేలు జరగాలంటే మళ్లీ జగనన్న అధికారంలోకి రావాలన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలిచే పార్టీ వైఎస్సార్‌సీపీ అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం వచ్చిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కార్యకర్తలు లేకుంటే పార్టీనే లేదని, పార్టీకి పునాదులు కార్యకర్తలేనన్నారు. జగనన్న వంటి గొప్ప నాయకుడు తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలతో పాటు కార్యకర్తలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చిత్తూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అనుబంధ కమిటీల నియామకాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు చొరవతీసుకుని త్వరగతిని పూర్తి అయ్యేలా చేయాలన్నారు. కమిటీల నియామకాలను ఒక యజ్ఞంలా పూర్తి చేద్దామని కోరారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలలో సమావేశాలు నిర్వహించుకుని కమిటీలను నియమించాలన్నారు. ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని నియోజకవర్గాల సమన్వయకర్తలు బియ్యపు మధుసూధన్‌రెడ్డి, వెంకటేగౌడ్, భూమన అభినయ్‌రెడ్డి, విజయానందరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోటి రాజేష్, డాక్టర్ సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కమిటీ నియామకాలతోనే
పార్టీ బలోపేతం
వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే సైనికులు


