ఏపీఎండీసీ వైఖరికి నిరసనగా మిల్లులు మూత
ఓబులవారిపల్లె :టీడీపీ అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాల కారణంగా మంగంపేట గనులపై ఆ ధారపడి ఏర్పరుచుకున్న పల్వరైజింగ్ మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా సీ అండ్ డీ గ్రేడ్ ముడి ఖనిజానికి రెండు రకాల ధరలు నిర్ణయించడం, ప్రస్తుతం పిలిచిన టెండర్లలో నిబంధనలతో ఇబ్బందులు పెట్టడంతో మిల్లుల యజమానులు దిక్కుతోచని స్థితిలో గురువారం నుంచి స్థానికంగా ఉన్న పల్వరైజింగ్ మిల్లులన్నీ స్వచ్ఛందంగా మూసి వేసి ఖనిజ రవాణాన్ని నిలిపి వేశారు. దీంతో మంగంపేట ఏపీఎండీసీలో డిస్ప్యాచ్ నిలిచిపోయింది. వాహనాలు మిషన్లు ఆగిపోయాయి. మంగంపేట నీరుపల్లె ఆంజనేయస్వామి దేవాలయంలో మిల్లు యజమానులు సమావేశమై ఏపీఎండీసీ యాజమాన్య వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏపీఎండీసీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా సీ అండ్ డీ గ్రేడ్ ఖనిజానికి ఎగుమతి దారులకు రూ.1.190, పల్వరైజింగ్ మిల్లులకు రూ.1.680 ధరల వ్యత్యాసంతో అమ్మకాలు జరగలేదని విమర్శించారు. స్థానికంగా ఏపీఎండీసీ గనులుపై ఆధారంగా నిర్మించుకున్న పల్వరైజింగ్ మిల్లులు కేవలం ముగ్గురాయి ఆడేందుకు మాత్రమే ఉపయోగపడతాయని, తద్వారా వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఏపీఎండీసీ యాజమాన్యం నిబంధనలు పేరుతో పర్వరైజింగ్ మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. బల్కర్ టెండర్ పేరుతో ఎగుమతిదారులకు తక్కువ ధరకు ఖనిజాన్ని ఇవ్వడం స్థానికంగా ఉన్న చిన్న పరిశ్రమలకు అధిక ధరకు విక్రయించడం ఏమిటని ప్రశ్నించారు. ఎగుమతిదారులకు ఇస్తున్న ధరకే పల్వరైజింగ్ మిల్లులకు కూడా ఇవ్వాలని వారు కోరారు. మంగంపేట ఏపీఎండీసీ ముగ్గురాయి ఖనిజం ప్రపంచంలోనే మేలురకం ఖనిజమని, ఇష్టారాజ్యంగా ఎగుమతులు చేయడం ద్వారా భవిష్యత్తులో ముగ్గురాయి ఖనిజాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. ముడి ఖనిజం ఎగుమతులు ఆపేసి కేవలం పౌడర్ ను మాత్రమే ఎగుమతి చేయాలని, తద్వారా స్థానిక మిల్లులకు ఉపా ధి కలిగి వేలాది మందికి జీవనోపాధి కలుగుతుందన్నారు. ఏపీఎండీసీ యాజమాన్యం వెంటనే ఈ విషయంపై స్పందించి ఎగుమతి దారులకు ఇస్తు న్న ధరలకే మిల్లులకు కూడా ముగ్గురాయి ఇవ్వాలని వారు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మిల్లులు ఖనిజ రవాణా స్వచ్ఛందంగా నిలిపివేశామన్నారు. పల్వరైజింగ్ మిల్లుల యజమానులు మాచినేని విశ్వేశ్వర నాయుడు, గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి, గజ్జల శ్రీనివాసులురెడ్డి, కాలూరు మధుసూదన్ రెడ్డి, గునిపాటి చిన్నరాయుడు, తల్లెం రమణారెడ్డి, జరుగు నారాయణ రెడ్డి, కౌలూరు రమణారెడ్డి, కౌలూరు శ్రీనివాసులు రెడ్డి, కల్లా చలపతి, పోతల లక్ష్మీనారాయణ, కౌలూరు బ్రహ్మానందరెడ్డి, అంబికా రవి, గల్లా సురేష్, గల్లా రమణ తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎండీసీ వైఖరికి నిరసనగా మిల్లులు మూత
ఏపీఎండీసీ వైఖరికి నిరసనగా మిల్లులు మూత


