గమ్మత్తులో దాడులు
గంజాయి మత్తులో గ్రామస్తులపై దాడులు
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వారే టార్గెట్
స్థానిక ప్రజాప్రతినిధి అండతో
చెలరేగుతున్న ఇసుకాసురులు
చోద్యం చూస్తున్న పోలీసు, రెవెన్యూ
అధికారులు
గంజాయి మత్తులో యువత కూరుకుపోయింది. ఆ మత్తులో యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఆ యువతను పచ్చనేతలు, ఇసుకాసురులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. తమ అక్రమ రవాణాకు అడ్డుపడిన వారిని లక్ష్యం చేసుకుని, వారిపై దాడులు చేయిస్తున్నారు. గంజాయి మూకలు ఏకంగా ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
చంద్రగిరి: పచ్చ నేతల ధనదాహానికి పల్లె ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అక్రమ ఇసుక, గ్రావెల్ దందాను అడ్డుకున్న వారిని టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు గంజాయి మూకలను దాడులకు ఉసిగొల్పుతున్నారు. చంద్రగిరి మండలంలో కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు గంజాయి ముఠాను ప్రోత్సహిస్తూ, వారికి అడ్డొచ్చిన వారిపై దాడులకు ఉసిగొల్పి, అక్రమ ఇసుక, గ్రావెల్ దందాను కొనసాగిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులకు టీడీపీ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధి పేరు చెప్పి వారిని లోబరుచుకుంటున్నారు.
రెడ్డివారిపల్లిలో ఇళ్లు ధ్వంసం
మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీ ఎగువరెడ్డివారిపల్లిలోని ఓ ఇంటిపై మంగళవారం అర్థరాత్రి గంజాయి మూకలు దాడికి పాల్పడ్డారు. స్థానికంగా ఉండే సన్నీ అనే వ్యక్తితోపాటు తిరుపతికి చెందిన సుమారు 10 మంది గంజాయి మూకలు అర్ధరాత్రి ఎగువ రెడ్డివారిపల్లికి చెందిన మౌనిక ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఇంటి కిటికీలు, విద్యుత్ మీటరు, ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇంటి ప్రధాన ద్వారంపై భారీ బండరాళ్లతో మోదారు. పెద ఎత్తున అరుస్తూ వారి ఇంటిపై దాడికి పాల్పడడంతో ఆ ఇంట్లోని వారు కేకలు వేశారు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి జరిగిన ఇంటిని పరిశీలించారు. దాడి జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు కూడా గాయం కావడంతో స్థానికులు ప్రథమ చికిత్స చేశారు.
ఇసుకాసురులను అడ్డుకోవడంతోనే దాడులు
స్వర్ణముఖినది నుంచి నియోజకవర్గ ప్రజాప్రజనిధి అనుచరులు అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో ఇటీవల గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఓ ఇసుకాసురుడు ఏకంగా గ్రామ హద్దురాయిని జేసీబీతో తొక్కించారు. ఆ ప్రజాప్రతినిధి పేరుతో పట్టణానికి చెందిన ఓ నేత చేస్తున్న స్మగ్లింగ్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు అదే గ్రామానికి చెందిన గంజాయి లీడర్ సన్నీని అడ్డుపెట్టుకుని గ్రామస్తులపై దాడులకు పాల్పడుతున్నారు. గతంలోనూ ఓ వ్యక్తిపై దాడికి చేసి హత్యాయత్నానికి పాల్పడారు. ఈ దాడులపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
గంజాయి లీడర్‌పై పోలీసుల ఉదాసీనత
గంజాయి విక్రయాలు, సేవించడానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సన్నీపై పోలీసుల ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలల కిందట గంజాయి మత్తులో ఓ ఆటో డ్రైవర్‌పై సన్నీతోపాటు మరికొంత మంది దాడి చేసి, రూ.7 వేల నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఆటోడ్రైవర్ సన్నీకి పోలీసుల అండ ఉందని నిమ్మకుండిపోయారు. అంతేకాక ఇళ్లపై దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు నామమాత్రం కేసులు నమోదు చేసి, చేతులు దులుపుకోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సన్నీపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రగిరిలో చెలరేగిపోతున్న గంజాయి మాఫియా
గమ్మత్తులో దాడులు


