వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిపై టీడీపీ వర్గీయు
వేలాది మంది జనం, ఎమ్మెల్యే సమక్షంలోనే దాడి
చంద్రగిరి: చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పడాకుల శేషాద్రిరెడ్డిపై టీడీపీ వర్గీయులు భౌతిక దాడులకు పాల్పడి, గాయపరచడంతో వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి బుధవారం ఆయన్ని పరామర్శించారు. టీడీపీ వర్గీయులు ఎందుకు దాడి చేశారన్న విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జల్లికట్టులో వైఎస్సార్ సీపీ పలకలు కడితే కొడతారా?, పచ్చని పల్లెలకు రక్తపు మరకలు అంటించడం మంచిది కాదు..పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుండడంతోనే తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఐదేళ్లు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీల నేతలను మంచిగా చూసుకున్నారని, వైఎస్సార్ సీపీ నేతలు గొడవలు చేస్తే వారిపైనే కేసులు పెట్టించి, పల్లెల్లో ప్రశాంతతను నెలకొల్పారన్నారు. ప్రతిపక్షాలను కేవలం ప్రత్యర్థులుగా మాత్రమే చూశామని, శత్రువులుగా ఎప్పుడూ చూడలేదన్నారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి చంద్రగిరిలో కనిపించడం లేదని, పచ్చని పల్లెలకు రక్తపు మరకలు అంటిస్తున్నారని, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై వరుస దాడులు చేస్తున్నారన్నారు. ఎవరికై నా సహనం కొంత వరకే ఉంటుందని, ఏదో ఒకరోజున సహనం కోల్పోయి ఇటువైపు నుంచి కూడా ఎదురు దాడులు మొదలైతే పల్లెల్లో ప్రశాంతత లేకుండా పోతుందన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కళ్లముందే వైఎస్సార్ సీపీ కార్యకర్తను కొడుతుంటే ఆపకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వేలాది మంది జనం ముందు వైఎస్సార్ సీపీ నేతను కొట్టడం చూస్తుంటే ఎంతకు బరితెగించారో అర్థమవుతోందన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతోనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తరచుగా దాడులు జరుగుతున్నాయని, ఎదురు దాడులు మొదలైతే దానికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవడానికి తాము ఎంత దూరమైన ముందుకు వెళతానని స్పష్టం చేశారు. అంతకు ముందు శేషాద్రిరెడ్డి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో పార్టీ మండల అధ్యక్షులు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బోసు చంద్రారెడ్డి, రాజయ్య, బుల్లెట్ చంద్రమౌళి, ఉపసర్పంచ్ మోనీష్‌రెడ్డి, బీకే. వినోద్ కుమార్, దేవా, దేవరాజులు, మురళి, భాస్కర్ రెడ్డి, హస్సేన్ ఉన్నారు.


