రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ టీఏ మృతి
పెళ్లకూరు: 71వ నంబరు జాతీయ రహదారిలోని దిగువచావలి గ్రామం వద్ద బుధవారం కర్ణాటక ఆర్టీసీ బస్సు మోటారు బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఉపాధిహామి టీఏ సయ్యద్ షమీమ్ ఉద్దీన్ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కథనం మేరకు.. ఉపాధిహామి టీఏ సయ్యద్ షమీమ్ ఉద్దీన్ పెళ్లకూరులో విధులు ముగించుకుని మోటారుబైక్‌లో నాయుడుపేటకు వెళుతుండగా మార్గం మధ్యలో దిగువ చావలి గ్రామం వద్ద బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో షమీమ్ ఉద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హుండీ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
సత్యవేడు: హుండీ చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సత్యవేడు ఎస్‌ఐలు టి.సాయినాద్, బి.లావణ్య తెలిపారు. మండలంలోని పుదుకుప్పంలో నూతనంగా నిర్మించిన మురుగన్, విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీ రాత్రి హుండీ పగులగొట్టి రూ. 2500 చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేవీబీపురం మండలం పాతపాళెం అరుంధతివాడకు చెందిన డి.చందు,(20), పి.హేమంత్(20), పి.వంశీ(18)ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిఘా ఉంచారు. సత్యవేడు ఎస్‌ఐలు టి.సాయినాద్, బి.లావణ్య సిబ్బందితో కలసి సత్యవేడు– ఊత్తుకోట మార్గంలోని వీఆర్ కండ్రిగ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బజాజ్ సీటీ 100 ద్వికచ్రవాహనంపై వచ్చిన ముగ్గురుని అనుమానించి, అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, రూ.50 వేలు విలువ చేసే ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. చోరీ కేసులో నిందితులను త్వరితగతిన అరెస్టు చేసిన సత్యవేడు ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ మార్కొండేయులు, హెడ్ కానిస్టేబుల్ ఆర్. ప్రతాప్, పీసీలు కే కుప్పారావు, ఎస్. చల్లయ్య, కే. విజయ్‌ను పుత్తూరు డీఎస్పీ, సీఐ అభినందించారు.
జేబు దొంగ అరెస్టు
తిరుమల: శ్రీవారి భక్తుల్ని మోసగించి జేబుల్లోని వస్తువులను చోరీ చేస్తున్న వ్యక్తిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌ఐ లు రమేష్, చలపతి తెలిపారు. ఎస్‌ఐల కథనం మేరకు.. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం కంపార్ట్‌మెంట్ 19లో ఓ మహిళ భక్తురాలి జేబులో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై వారి కుటుంబసభ్యుడు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రెడ్డెప్ప ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 21వ తేదీన ఆస్థాన మండపం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తమిళనాడుకు చెందిన శివయ్య అలియాస్ శివ(55)గా గుర్తించామని ఎస్‌ఐలు తెలిపారు. క్యూలోని భక్తుల జేబుల్లో చోరీకి పాల్పడినట్లుగా విచారణలో తేలిందని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 56 గ్రాముల బంగారం, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకుని, నిందితుని రిమాండ్‌కు తరలించామన్నారు.
దొంగకు మూడేళ్లు జైలు
తిరుపతి లీగల్: నగరంలో మూడు వేర్వేరు చోట్ల మూడు ద్విచక్ర వాహనాలను అపహరించిన వేర్వేరు కేసుల్లో శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మండలం, కాలసముద్రం గ్రామానికి చెందిన పఠాన్ షాహిద్ బాషా అలియాస్ షాహిద్‌కు ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.వంద చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి పల్లపోలు కోటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు కానిస్టేబుల్ అయ్యప్ప కథనం మేరకు.. నిందితుడు షాహిద్‌బాషా ఇద్దరితో కలిసి 2024 డిసెంబర్ ఐదో తేదీ కొర్లగుంట మారుతి నగర్‌లో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు. అలాగే గత ఏడాది జనవరి ఏడో తేదీ స్థానిక రైల్వే కాలనీలో ఒక ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. వాహనాల యజమానుల ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. నిందితుడు షాహిద్ బాషాను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసుల పూర్వపురాలను పరిశీలించిన న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది.


