● డైట్‌లో ఉత్సాహంగా రంగోత్సవ పోటీలు ● విజేతలకు బహుమతులు
రంగోత్సాహం!
కార్వేటినగరం: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే రంగోత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్టు డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. బుధవారం డైట్‌లో రంగోత్సవ పోటీలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీ లు దోహదపడుతాయన్నారు. జిల్లా విద్యాశాఖ ఏపీసీ అధికారి వెంకటరమణ మాట్లాడారు. తరువాత రంగోత్సవ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందించారు. జానపద పోటీల్లో చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారని, ద్వితీయ స్థానంలో సత్యవేడు మండలం, రాజగోపాలపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు, తృతీయ స్థానంలో వరదయ్యపాళ్యం మండలం, సంతవేలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు కై వసం చేసుకున్నట్టు వెల్లడించారు. అలాగే రోల్‌ప్లే పోటీల్లో చిత్తూరు పట్టణం దేవీ బాలమందిర్ విద్యార్థులు ప్రథమ స్థానంలో.. చిత్రలేఖన పోటీల్లో కార్వేటినగరం బాలికోన్నత పాఠశాల మొదటి స్థానంలో నిలిచాయి. చిత్తూరు దేవిబాలమందిర్ హైస్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో, చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. రంగోలి పోటీల్లో నాగలాపురం మండలం, ఎస్‌ఎస్‌పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో, సత్యవేడు మండల, రాజగోపాలపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో, దేవీబాల మందిర్ చిత్తూరు సంతపేట విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. చేతి రాత పోటీల్లో చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో, నాగలాపురం మండలం ఎస్‌ఎస్‌పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో, పాలసముద్రం మండల టీఆర్‌పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచినట్లు డీఈఓ పేర్కొన్నారు. అనంతరం విజేతలకు డీఈఓ చేతుల మీదుగా బహుమతులను అందించారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు 23వ తేదీ విజయవాడలోని పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
చంద్రగిరిలో దోపిడీ దొంగల బీభత్సం
చంద్రగిరి: పట్టణంలోని దాసరవీధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి లోపలికి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం అర్థరాత్రి ఒక ఇంట్లో సుమారు రూ.10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించగా, మరో ఇంట్లో రూ.50 వేల రూపాయల విలువైన వెండి వస్తువులను చోరీ చేశారు. బుధవారం ఉదయం ఇళ్లకు చేరుకున్న యజమానులు, తలుపులు పగులగొట్టి ఉండడం చూసి షాక్‌కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి సీఐ సురేష్, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. కేసు దర్యాప్తులో ఉంది.
● డైట్‌లో ఉత్సాహంగా రంగోత్సవ పోటీలు ● విజేతలకు బహుమతులు


