ఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎస్
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం వద్ద ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివవంకర్ లోతేటి పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతోపాటు ట్రైనీ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ఆ కార్యాలయం వద్ద సీఎస్ విజయానంద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం సీఎస్ విజయానంద్ సీఎండీ కార్యాలయంతోపాటు సమావేశ మందిరంలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నూతనంగా అమలు చేస్తున్న డయల్ యువర్ సీఎండీ, కరెంటోళ్ల జనబాట వంటి కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణపై ఆరా తీశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలతో పాటు తిరుపతి నగరానికి చెందిన పలువురు వ్యాపారులు విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వాడకం అధికంగా పెరుగుతుండడంతోపాటు దానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పతి చేయడానికి ఉన్న అవకాశాలపై సీఎస్ విజయానంద్ సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖకు ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో 2026–27కు సంబంధించిన ఏపీఎస్పీడీసీఎల్ తయారు చేసిన వార్షిక ప్రణాళికలను సీఎండీ శివశకంర్ ఆయనకు అందజేశారు. కాగా ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతస్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించగా మీడియాను అనుమతించలేదు.


