ఉలిక్కిపడిన తెలుగు తమ్ముళ్లు
రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో కొండను చదును చేసి ప్లాట్లు వేసి, విక్రయానికి పెట్టిన తెలుగు తమ్ముళ్లు అక్రమాలపై సాక్షిలో మంగళవారం ‘కొండలనూ మింగేస్తున్నారు’ శీర్షికన కథనం రావడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. దానికి తోడు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం, రెండు ట్రాక్టర్లను సీజ్ చేయడంతో ఉక్కిరిబిక్కిరి అయిన స్థానిక తెలుగు తమ్ముళ్లు మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సాక్షిదినపత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అసత్యమని, అక్రమాలు ఏమీ జరగలేదని, జరిగినట్లు నిరూపించాలని టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బుజ్జినాయుడు వితండవాదం చేశారు. గ్రామంలో కళ్లెదురుగా కొండను తవ్విన ఆనవాళ్లు ఉండగా, ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరీ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంతో స్థానికంగా ఆయన నవ్వుల పాలయ్యారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా తెలుగు తమ్ముళ్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తమకేమీ సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఆక్రమణలే జరగకపోతే రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఎందుకు పెడతారు. అక్రమ తవ్వకాలు జరగకపోతే కొండను తవ్విన ఆనవాళ్లు ఎక్కడ నుంచి వచ్చాయని స్పష్టత ఇవ్వకుండా ప్రెస్‌మీట్‌ను ముగించారు.


